17, ఏప్రిల్ 2016, ఆదివారం

సీతాపతి సంసారానికి చిచ్చుపెట్టిన చాకలితిప్పడి పాట!!

రామాయణం రసవద్భరితమైన కమనీయ కావ్యం. అందులో సీతా పరిత్యాగ ఘట్టం అంత కరుణరసప్లావితమైన ఘట్టం మరొకటి ఉండదు. లోకాపవాదానికి భయపడి శ్రీరాముడు సీతను పరిత్యజించడానికి పూనుకుంటాడు.
రామో విగ్రహాన్ ధర్మః అంటారు. మూర్తీభవించిన ధర్మమే రాముడు.ప్రజలను పాలించే రాజు ధర్మంతప్పకూడదని రాముడు నమ్మాడు. ధర్మంకోసం ప్రాణప్రదమైన భార్యను వదులుకున్నాడు.
ఎంతో అన్యోన్యంగా ఉండే సీతారాములను ఈ విధంగా విడదీయడానికి కారణమైన ఒక గొప్ప సంఘటన-రాజ్యంలోని ఒక చాకలివాడు శ్రీరాముడి గురించి చేసిన ఒక వ్యాఖ్యానం. ధర్మాన్ని పాటించే రాజుగా రాముడు  సీతా పరిత్యాగం చేసి తీరవలసిన సందర్భాన్ని కల్పించారు వాల్మీకి. ఈ సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా, రామాయణంలోని మూలకథకు భంగం కలగకుండా చక్కగా చిత్రించారు లవకుశ సినిమాలో.
ఊరికే ఒక చాకలి ఒక మాట అన్నట్టు చూపించినా ప్రేక్షకులకి తెలుస్తుంది. కానీ చాకలి పాత్రను, అతని భార్య పాత్రను కథలో ప్రముఖంగా తీసుకువచ్చి హాస్యం  పుష్కలంగా పండించి క్రమంగా కరుణరస ఘట్టంలోకి తీసుకువెళ్తారు. చిత్రదర్శకులు, సంగీత దర్శకుడు, అభినయం చేసిన నటులు అందరి ప్రతిభతో చక్కని హాస్యగీతంగా  ఇది చిత్రించబడింది.
చాకలివాడి పాత్రకు రెండు పాటలు పెట్టారు. వెయ్యర దెబ్బా  - అనే ముందు పాటలో అంటూ చాకలి వారి పనిపాట్లు, జీవన విధానం ముందుగా పరిచయం చేస్తారు. పాటలోనే చాకలివాడికి తన భార్య పట్ల తెగ అనుమానం అనే విషయం స్పష్టం అవుతుంది.ఎప్పుడూ భార్య తనతోనే ఉండాలని అనుకుంటాడు. భార్య ఎటు చూసినా అనుమానిస్తూ ఉంటాడు. అందుకే " అటేపు చూస్తావ్, చిటికెలు వేస్తావ్ - అటెవ్వరున్నారే మిటికరించి నను మిర్రున చూసి మెటికలిరుస్తావెందుకు" అని పదే పదే అడుగుతుంటాడు. " అదేమి మాట మామా, అలాగంటావు నేను అలాంటి దాన్ని కాదు" అంటుంది. అప్పకూతురువని సరసమాడాను అని తన మాటలని సమర్థించుకుంటాడు.  భార్యాభర్తలమధ్య సయోధ్యలేదని ఈ పాట ద్వారా తెలుస్తుంది. మరి కొద్ది కాలం తర్వాత జరిగిన మరొక సంఘటనే ప్రధాన కథను ముందుకు తీసుకు వెళుతుంది. 

పాట ప్రారంభంలో చాకలివాడు తన భార్య ఇంట్లో లేదని ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.ఎండుమిరపకాయలు నములుతూ కోపం పెంచుకొని, తన భార్యరాగానే ఆమెను కొట్టాలని చూస్తూ ఉంటాడు. రాగానే ఎక్కడికెళ్లావు అని అడుగుతాడు. తన అప్పగారి ఇంటికి వెళ్లానని చెప్తుంది భార్య.ఆమెమాటలు నమ్మడు. ఆమెని నరికేస్తానంటూ మీదపడతాడు. చుట్టుపక్కల అంతా చేరతారు. భార్యకి తల్లి,( తనఅక్కే) అత్తగారు, మామగారు వస్తారు అల్లుడికి సర్ది చెప్పడానికి.
"నాకు మీ పిల్ల ఇక వద్దు మీరే తీసుకుపొండి" అంటూ ప్రారంభిస్తాడు చాకలి.

 చాకలి      ఒల్లనోరి మామా నీ పిల్లని
               నేనొల్లనోరి మామా నీ పిల్లని
               అబ్బా నీ పిల్లా  దీని మాటలెల్ల కల్లా
              సంసారమంత  గుల్లా
ఆ భార్యమీద అనుమానం కదూ  - నేనింక నీ పిల్లని భరించలేను. అన్నీ అబద్ధాలే చెబుతుంది. నీ కూతురి మాటలు వింటే ఇక సంసారం గుల్ల అవుతుంది నాకీ భార్య వద్దు అంటాడు.
భార్య         నన్నొల్లనంతవెందుకు మామయ్యా
               నావల్ల నేరమేమిర అయ్యయ్యో
               దయ్యమని కొడుదనా దేవతని కొడుదునా
                నూతిలోన పడుదునా గోతిలోన పడుదునా
అంటూ చాకలి భార్య భర్తను మంచి చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ' నావల్ల నేరమేమిటి' అంటూ అమాయకంగా తనకేం తెలియదని బుకాయిస్తుంది. 'నువ్వు నన్ను అనవసరంగా నిందిస్తున్నావు. నీ స్వభావం ఏమిటో, నువ్వు పెట్టే బాధలు, నీ మాటలు భరించలేకుండా ఉన్నాను. నుయ్యో గొయ్యో చూసుకోవాలి నేనింక' అని బెదిరిస్తుంది.
చాకలి         చవటకారి నాయాలా ఊరుకో
                 సూరిగాడి ఇంటికాడ చూడలేదటే నిన్ను
                 మారుమాటలాడతావ, మాయదారి గుంటా
                 నిను సూత్తె  ఒళ్ళుమంట
కానీ అప్పటికే భార్య మీద అనుమానమే కాదు, తగిన సాక్ష్యం కూడా సంపాదించి ఉన్నాడు చాకలి.ఆమె మీద కోపం అంతా చవటకారి నాయాలా అంటూ ఒక్క తిట్టులో చూపించాడు. అంతకు ముందే ఆ ఊళ్ళో ఉన్న సూరిగాడి ఇంటిదగ్గర భార్యను చూసాడు. భార్యకి ఆ విషయం తెలియదు. అందుకే తన అక్కగారింటినుంచి వస్తున్నానని అబద్ధం చెప్పింది. తాను ఆమెను చూసానన్న విషయం చెప్పి 'మాయదారి మాటలతో ఇక నన్ను మభ్యపెట్టలేవు' అంటూ ఆమెను అసహ్యించుకొని తన కోపాన్ని చూపిస్తాడు.
మామగారు    నామాటినురా బాబూ.....ఓ రల్లుడ మేనల్లుడ.... మా అప్పగోరి పిల్లడా
                             అయిందానికల్లరెందుకల్లుడా ఓరల్లుడ మేనల్లుడ
                            నీ అప్ప ముగం చూడర మా అమ్మిని కాపాడరా
ఇక  మూడోమనిషి జోక్యంతో కానీ ఇది చక్కబడేలా లేని స్థితికి వచ్చిందని గ్రహిస్తాడు మామగారు. నామాటినురా బాబూ అంటూ బతిమాలుతూ  ఓ అల్లుడా, మేనల్లుడా, మా అప్పగోరి పిల్లడా అంటూ తన అక్కకొడుకే అల్లుడు కనుక తమ పిల్ల తప్పు చేసినా క్షమించమని కాళ్లబేరానికి వస్తాడు. ఏదో అనుకోకుండా తప్పు జరిగిపోయింది. ఇంకా అల్లరి చేసుకుని చుట్టుపక్కలవారి మధ్య అవమానం పాలవడం ఎందుకు అని సర్దిచెప్పచూస్తాడు. అల్లుడు తనకేమో అక్క కొడుకు, మేనల్లుడు. ఆ అక్కగారి కూతుర్నే తను చేసుకున్నాడు. అంటే అల్లుడు అక్క కొడుకు, భార్యకి తమ్ముడు. ఇంత దగ్గరి బంధువు. పిల్ల తెలియకుండా తప్పుచేస్తే క్షమించడం కూడా తప్పదుమరి అని బతిమాలుతూ తమ బంధుత్వాన్ని గుర్తుచేస్తాడు.
"నేనొల్లనోరి మామా నీ పిల్లని" అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు అల్లుడు.వరుసకి బావ,మామగారు అయిన ఆ మనిషి ఎంత చెప్పినా తన పట్టుదల వదులుకోడు చాకలి. 
ఇక లాభం లేదని అక్కగారు రంగంలోకి దిగింది.
చూడూ.........తప్పేమి చేసింది తమ్ముడా
ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా
తప్పతాగి ఉన్నావు చెప్పుడు మాటిన్నావు
అప్పడగబోయింది అదీ ఒక తప్పా..ఏరా
అక్క కాబట్టి ఆప్యాయంగా ఏరా అంటూ సంబోధిస్తుంది. తన కూతురు ఇంటి దగ్గర లేకపోవడాన్ని సమర్థించుకుంటూ ఓ కారణాన్ని కల్పించింది. " అప్పు అడగడం కోసం వాడి ఇంటికి వెళ్ళింది కానీ అదీ ఓ పెద్ద తప్పులా చూపిస్తావేం" అని  చనువుగా గదమాయించింది. పైగా తాగి ఉన్నావు అందుకే నీకు మంచి చెడు తెలియడం లేదు- అంటూ అల్లుడయిన తమ్ముణ్ని అక్కగా తన అధికారం చూపించింది.
అప్పా ఓ లప్పా నీ మాటలు నేనొప్పా ఇక చాలును నీగొప్పా
నా ఆలిగుణం ఎరుగనటే........ ఏలు కోను తీసుకుపో
ఎక్కడైనా బావేకానీ వంగతోటకాడ మాత్రం కాదు -అన్నట్టు ఉన్నాడు తమ్ముడు. అప్పా ఓలప్పా అని అక్కను పిలిచి ఎన్ని చెప్పినా నా భార్య గుణం నాకు తెలుసు, నేనింక ఆమెను ఏలుకోబోయేది లేదు అని తెగేసి చెప్పాడు.
తల్లి తండ్రి చెప్పినమాటలతో భర్తలో మార్పు వస్తుందని చూసింది చాకలి భార్య. కానీ ఏం  ప్రయోజనం లేకపోయింది. అంతవరకూ గట్టి స్వరంతో మాట్లాడినది కాస్తా ఇక స్వరం తగ్గించి బతిమాలడం మొదలు పెట్టింది. తాగుబోతువై  నా మీద నిందలు వేస్తున్నావు. నేను సత్యమైన ఇల్లాలిని చూడు అంటూ ప్రమాణాలు చేయడం మొదలు పెట్టింది.
నీ తాగుపోతు మాటలింక మానరా
నే సత్తెమైన ఇల్లాలిని చూడరా
నేనగ్గి ముట్టుకుంటా తలమీద పెట్టుకుంటా
అంటుంది.రాముడు అనుమానించినప్పుడు  సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. అందువల్ల తానూ కూడా అలాగే చేస్తానంటుంది.
వెర్రి రాముడంటి ఓణ్ణి కానులే
గొప్ప శౌర్యమున్న ఇంట పుట్టినానులే
నువ్వగ్గిలోన పడ్డా బుగ్గిలోన పడ్డా
పరాయింట ఉన్నదాన్ని పంచచేరనిస్తానా
ఈ ఆఖరి చరణం రాముడి పాత్రపై ఒక చాకలి చేసే వ్యాఖ్యానం. ఎంత గొప్పగా రాసారో సదాశివ బ్రహ్మంగారు. తాను రాముడిలావెర్రివాడిని కాను అంటాడు. గొప్ప శౌర్యమున్న ఇంట పుట్టినాను అంటాడు. అంటే రాముడు పనికిరానివాడు, వీర్యగుణం లేనివాడు అనే కదా అర్థం. .రాముడు వఠ్ఠి తెలివితక్కువవాడని, బుద్ధిలేని పని చేసాడని, భార్య పరాయివాడిదగ్గర అన్నిరోజులు ఉన్నా తిరిగి తెచ్చుకున్నాడని ఛీత్కారంగా మాట్లాడతాడు. భార్యతో - నువ్వు సీతలాగా అగ్గిలో పడి అగ్ని ప్రవేశం చేసినా, బుగ్గిలోన పడి బూడిద అయిపోయినా సరే,  పరాయి ఇంటినుంచి వచ్చినదానివి నిన్ను నా ఆశ్రయం లో ఉండనిస్తానా....ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నా ఇంట ఉంచుకోను. నిన్ను నా భార్యగా అంగీకరించను అని తెగేసి చెప్తాడు
సీతా పరిత్యాగానికి రంగం సిద్ధం అయింది. జరిగిన, జరగుతున్న విషయాలేవీ తెలియని సీతను లక్ష్మణుడు వనభూములలో వదలడం, చెప్పలేక చెప్పలేక అన్నగారి ఆజ్ఞను ఆమెకి వివరించడం, సీత హతాశురాలై మూర్ఛపోవడం, వాల్మీకి ఆశ్రమంలో చేరడం తరువాత వచ్చే కరుణరసాత్మకమైన సంఘటనలు. ముందు సీతారాముల అనురాగభరితమైన సన్నివేశాలతో శృంగార రసాన్ని ఆవెంటనే  రాముడిపై చాకలివాడి వ్యాఖ్యలతో సీతా పరిత్యాగ ఘట్టానికి నాంది పలుకుతూ మధ్యలో సన్నివేశాన్ని హాస్యరసంతో చిత్రించారు. చాకలి, అతని భార్య, అక్క, బావ ఉండే ఈ ఘట్టానికి చక్కని  పాత్రోచితమైన భాషతో ఈ గీతాన్ని రాసారు సదాశివబ్రహ్మంగారు. 

రాముడు అంత కఠోరమైన నిర్ణయం తీసుకోవడానికి, చాకలి వాడి జీవితంలో జరిగిన సంఘటనను సామ్యంగా చూపించి, ఒక సాధారణ పౌరుడి సంభాషణ ద్వారా దానికి నాంది పలికించారు. అగ్గిలోనపడి తన ప్రవర్తనలో దోషం లేదని నిరూపించుకుంటానని భార్య అంటే,  నువ్వు ఎక్కడ పడినా నాకు నువ్వు వద్దు అని చెప్పడమే కాకుండా నేను రాముడిలా వెర్రివాడిని కాదు అనిపించడం, నేను శౌర్యవంతుడిని అని చాకలివాడు  చెప్పడం,   తర్వాత కథలో రాముడు తీసుకునే నిర్ణయానికి మూల హేతువులు అయ్యాయి.
 చక్కని పాత్రోచితమైన సంభాషణలతో హాస్యరసం పండిస్తూ,కథను ముందుకు నడిపే ప్రయోజనం కోసం సృష్టించబడి, చక్కగా నిర్వహించబడింది ఈ పాట. రచయిత మాటలతో సృష్టించిన హాస్యాన్ని తమ హావభావ విన్యాసాలతో ఎంతో చక్కగా అభినయించి  పాటకి పూర్తి న్యాయం చేకూర్చారు నటీనటులందరూ. హాస్యభరితమయిన పాటల మణిహారంలో గొప్ప కాంతులీనే మణిపూస ఇది. తీసి అరవయ్యేళ్లయినా జనాదరణ తగ్గని పాట.


చిత్రం   లవకుశ
పాత్రలు చాకలి తిప్పడుగా రేలంగి, అత భార్యగా గిరిజ. మామగారుగా డా.శివరామకృష్ణయ్య .
గానం ఘంటసాల , జె.వి రాఘవులు, జిక్కి, రాణి.