కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా, అరటితొక్కా,
బల్లచెక్కా ఏదీ కవిత్వంలో వస్తువుగా అనర్హం కాదన్నారు శ్రీశ్రీ. ఉదాత్తమైన వస్తువు
మాత్రమే కవితా వస్తువుగా ఉండాలని మన ఆలంకారికుల నమ్మకం. కానీ సమాజంలో తేలికగా
చూడబడే సిగరెట్టు లాంటి వస్తువు మీద "న భూతో న భవిష్యతి"
అన్నట్టు అమోఘమైన పాట రాసారు కొసరాజుగారు. సరదా పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాటల్లో ఇది మరీ ఉత్తమమైన కోవకు చెందుతుంది
అన్నట్టు అమోఘమైన పాట రాసారు కొసరాజుగారు. సరదా పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాటల్లో ఇది మరీ ఉత్తమమైన కోవకు చెందుతుంది
సిగార్ అంటే ఎండిన పొగాకును చుట్టగా
చుట్టినది అని అర్థం. ఆ చుట్టని నైస్ గా చిన్నగా చుడితే అదే సిగరెట్. మన తెలుగుభాష మర్యాద
ప్రకారం ద్విరుక్తం చేసి సిగరెట్టుగా చేసుకుని వాడుకుంటున్నాం.
.
“సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్
సిగరెట్టూ
పట్టుబట్టి ఓ దమ్ములాగితే స్వర్గానికి ఇది
తొలిమెట్టు"
అంటూ ఓ భర్తగారు గుఫ్పు గుఫ్ఫుమని పొగను
పీలుస్తూ వదులుతూ స్వర్గం లో తేలుతున్నట్టుగా మురిసిపోతుంటాడు. భర్త దగ్గరకు వచ్చిన భార్య సిగరెట్టు పొగలు చుట్టుముట్టగా ఉక్కిరి
బిక్కిరవుతుంది. ఆ సందర్భంలో సిగరెట్టు
మంచి చెడులను ఎవరికి వారు సమర్థించుకుంటూ విమర్శించుకుంటూ
సంభాషించుకునే పాట ఇది. తనకి భర్తలో నచ్చని ఈ ధూమపానసేవనం నుంచి
ఎలాగయినా మరల్చాలని భార్య ప్రయత్నించడం,
ఎన్నో వాగ్బాణాలను విసరడం, భర్త వాటిని తెలివిగా తిరగ్గొట్టడం ఈ క్రమంలో
కొసరాజుగారి చమక్కులు ప్రేక్షకులకి, శ్రోతల మనసులకి చురుక్కమనిపంచడం, మనసుల్లో
హాసపు మెరుపులు చమక్కుమనడం షరా మామూలే.
భారతీయుల్లో ఉన్న పెద్ద అవలక్షణం - విదేశీ వస్తువుల పట్ల మోజు. మన దేశంలో పొగాకు కు
ఈ విధమైన వినియోగాన్ని పరిచయం చేసినవారు బ్రిటిషర్లు. బ్రిటిష్ దొరలు ఓ పైప్ నోట్లో వేసుకుని పొగను
పీలుస్తూ వదులుతూ అధికారం ప్రదర్శిస్తూ
దర్జాగా ఆర్డర్లు వేస్తుంటే ఆ దొరల స్టైల్
కి దాసోహమన్నారు చాలామంది. అందుకే అలా విలాసంగా, కులాసంగా కనిపించడానికి వారిని
అనుకరిస్తూ ఈ సిగరెట్ తో పొగతాగడంలోని
ఆనందాన్ని ఊరికే రుచి చూడడానికి ప్రారంభించి చివరకు దానికి దాసోహం అన్నారు.
“ దొరల్ దాగు బల్ సిగరెట్టూ “అంటూ ఆ భర్త సీమ దొరలను మెచ్చుకోవడం లో ఈ ఫాషన్ అనుకరణని చూపించారు
కొసరాజు.
తన కంపు తనకే ఇంపు కానీ ఇతరులకు కాదు
కదా. భార్యకి ఆ సిగరెట్ వాసన కంపుగా కనిపిస్తుందందుకే.
“ కంపుగొట్టు ఈ సిగరెట్టు కాల్చకోయి నా పై
ఒట్టు” అంటూ సెంటిమెంట్ తో అతన్ని
లొంగదీసుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తుంది.
మనిషి మీద ఒట్టు వేసి, ఆ పై మాట తప్పితే ఒట్టువేయబడిన మనిషికి ప్రాణం మీదకి
వస్తుందని మన నమ్మకం. అందుకే తన మీద ఒట్టు
వేస్తే భర్త ఆ పాడు సిగరెట్టు కాల్చే
అలవాటు మానుకుంటాడేమోనని ఆమె ఆశ. కానీ ఆ భర్త ఒట్టు వేయడానికి ఒప్పుకుంటేనా.
“కడుపు నిండునా కాలునిండునా వదిలి
పెట్టవోయ్ నీ పట్టు” అంటూ బతిమాలడం మొదలు పెట్టింది.
కడుపునిండుతుందా, కాలు నిండుతుందా అంటూ
ఏదైనా ప్రయోజనం లేని పనికి వాడే జాతీయాన్ని ఈ భార్య పాత్రతో అనిపించడం ఎంతో
చక్కని ప్రయోగం.
“ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేసాడు “ అంటూ సిగరెట్టు గొప్పదానాన్ని వివరించబోతాడు. ఆంజనేయుడు తన తోకకు
నిప్పంటించుకుని లంకను దహనం చేసాడు. ఆ
పురాణ గాథని వక్రీకరించి
భార్యకి సిగరెట్టు మంటతోనే ఆంజనేయుడు లంకాదహనం చేసాడని, అది అతి పవిత్రమైనదని చెప్పి ఆమెను ఒప్పించాలనుకున్నాడు. కానీ భార్య
అతను అనుకున్నంత అమాయకురాలు కాదు. అందుకే –
“ఎవడో కోతలు కోసాడు” అంటూ ఆ కల్లబొల్లి మాటలు నమ్మడం మీ తెలివితక్కువ అన్నట్టుగా
ఖండించేసింది.
ఇక సిగరెట్ కాల్చడాన్ని ఓ సరదా వ్యాపకంగా
చేసేవారు కొందరయితే దాన్ని ఓ మహా కళారాధనగా చేసేవారు మరికొంతమంది. ఈ సిగరెట్ పొగను
బయటికి వదలడంలో రింగులు రింగులు తిరిగేలా మబ్బుల్లా కనిపించేలా చేయడం ఓ కళగా
అభ్యసిస్తారు కొందరు. అలాంటివారిగురించే ఈ
మాట.
“ఈ
పొగతోటి గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు “ అని ఓ గొప్ప కళాసృష్టి చేయబోతున్నట్టు భార్యకి చూపించబోతాడు. కానీ
భార్య దాన్ని తేలిగ్గా కొట్టిపారేసింది. అలాంటి పనులు చేయబోయి, చేతకాక “ మీసాలు కాల్చుకోవచ్చు” అంటూ జరగబోయే
ప్రమాదాన్ని హెచ్చరించింది. నిప్పును నోట్లో పెట్టుకుని ఆటలు ఆడితే నోటిమీద మీసాలు
కాలే ప్రమాదం ఎంతేనా ఉంది మరి.
కన్నెపిల్లలుగా ఉన్నప్పటినుంచే ఆడవాళ్ళు
మంచి భర్తకోసం, అతని ఆరోగ్యం కోసం, క్షేమంకోసం లక్షా తొంభై నోములు నోస్తారు.
వ్రతాలు చేస్తారు. అలాంటిది తన కళ్ళముందే ఆ భర్త ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సిగరెట్లను
ఊదొత్తుల్లా వెలిగిస్తుంటే భార్య మనసు ఎంత దుఃఖపడుతుందీ. అందుకే అంటుంది ఆ బార్య-
“ ఊపిరితిత్తుల కాన్సర్ కిదియే
కారణమన్నారు డాక్టర్లూ”
అంటూ అతని ఆరోగ్యం గురించి హెచ్చరికలు చేస్తుంది. .
కానీ ప్రజలందరూ నిత్యం కొలిచే తెర వేల్పులు మన హీరోలు. ఈకంపెనీ సిగరెట్లు కాల్చండి
అంటూ పెద్ద పెద్ద హోర్డింగుల మీద నిలబడి చిద్విలాసంగా సిగరెట్లు కాల్చే ఫోటోలు ఎన్నో చూసాడు సదరు
భర్తగారు. అందుకే ఆ డాక్టర్ల కన్నా తాను అభిమానించే తన యాక్టర్ల మాటనే నమ్ముతాడు.
అంత గొప్ప యాక్టర్ సిగరెట్ కాలుస్తూ తనని కూడా కాల్చమని సలహా ఇస్తుంటే వద్దనడంలో
ఏమీ సహేతుకం కనిపించదు అతనికి.
ఆ రోజుల్లో యస్వీ రంగారావుగారు బర్కిలీ సిగరెట్లకి బ్రాండ్ ఎంబాసిడర్ అట. ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలిసినదే. ప్రజలు తమ అభిమాననటుల మాటలనే ఎక్కువగా నమ్ముతారని కంపెనీలకి తెలుసుకనుకే టాప్ నటులందరితోను తమ వస్తువులకి ప్రకటనలు గుప్పిస్తారు. ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి నటుల పోజు చూసి సిగరెట్లు అలవాటు చేసుకున్నవారు వేలాదిగా ఉన్నారు ఆంధ్రదేశంలో. అందుకే -
ఆ రోజుల్లో యస్వీ రంగారావుగారు బర్కిలీ సిగరెట్లకి బ్రాండ్ ఎంబాసిడర్ అట. ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలిసినదే. ప్రజలు తమ అభిమాననటుల మాటలనే ఎక్కువగా నమ్ముతారని కంపెనీలకి తెలుసుకనుకే టాప్ నటులందరితోను తమ వస్తువులకి ప్రకటనలు గుప్పిస్తారు. ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి నటుల పోజు చూసి సిగరెట్లు అలవాటు చేసుకున్నవారు వేలాదిగా ఉన్నారు ఆంధ్రదేశంలో. అందుకే -
“కాదన్నారులే పెద్ద
యాక్టర్లు “అంటూ భార్య మాటలకి రైమింగ్ గా జవాబు
చెప్తాడు.
సిగరెట్ పొగ గుండెలనిండా కమ్ముకుని బాగా “ పసరులా చేరి, కఫం పేరుకుని ఊపిరితిత్తులను పనిచేయకుండా చేసి క్రమంగా ఉసురుతీస్తుందని “ ఎంతో బాధగా చెప్తుంది భార్య. అవన్నీ” తెలివితక్కువ దద్దమ్మలు మాత్రమే వినే మాటలని ” తనకి తెలివి ఉందని ఆమె మాటని కొట్టిపారేస్తాడు.
సిగరెట్ పొగ గుండెలనిండా కమ్ముకుని బాగా “ పసరులా చేరి, కఫం పేరుకుని ఊపిరితిత్తులను పనిచేయకుండా చేసి క్రమంగా ఉసురుతీస్తుందని “ ఎంతో బాధగా చెప్తుంది భార్య. అవన్నీ” తెలివితక్కువ దద్దమ్మలు మాత్రమే వినే మాటలని ” తనకి తెలివి ఉందని ఆమె మాటని కొట్టిపారేస్తాడు.
సిగరెట్
కాల్చేవారికి దాని పొగ సుగంధ పరిమళాలు వెదజల్లవచ్చు. కానీ ఆ పొగను పీల్చేవారి
దురవస్థ వారికేం పడుతుంది. మిత్రులు తెలిసినవారు, సిగరెట్ తాగుతుంటే పక్కనున్నవారు ముక్కు మూసుకుంటే మర్యాదగా ఉండదేమోనని మొహమాట
పడేవారుంటారు. ఆ కంపు భరించలేక ఆ మాట చెప్పలేక
ముక్కులు ఎగరేస్తారు.
కానీ ఈ విషయాన్ని
తనకు కావలసినట్టు అర్థం చేసుకుంటారు ధూమపానిస్టులు. అందుకే
“ పక్కనున్నవారు దీని సువాసనకు ముక్కులు
ఎగరేస్తారు
నీవెరుగవు
దీని హుషారు”
అంటూ ఆమెకి పరమళాన్ని గుర్తించే
శక్తిలేకపోవడమేమిటో నని ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ఈ కంపు భరించలేకనే ధియేటర్లలో
ధూమపానాన్ని నిషేధించారని అతన్ని వారించబోతుంది భార్య. ధియేటర్లలో ఈ ధూమపాన నిషేదం
ప్రకటించినదగ్గర్నించే సినిమాలకు డబ్బులు వసూళ్ళు తగ్గిపోయాయని ఆ అస్త్రాన్ని
తిప్పికొడతాడు భర్త. ఇది తిరుగులేని అస్త్రం మరి. సినిమాలు బాగా ఆడకపోవడానికి
ఎన్నో కారణాలుంటాయి. కానీ ధూమపానం పైన నిషేధమే దానికి కారణమని చెప్పడం కొసరాజు
గారి చమక్కు.
నిరుపహతి స్థలమూ,
రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురపువిడెమూ - అంటూ
కవిత్వం రాయడానికి బోల్డు వస్తువులు అమరాలి అని పెద్దనగారు ఓ జాబితా చదివారు.
అందులో ఆధునికులు చేర్చుకున్న కొత్త
వస్తువు సిగరెట్టు. సిగరెట్టు ముట్టించి రెండు దమ్ములు పీలుస్తే కానీ మంచి కవిత్వం
రాయలేమని చాలామంది కవుల ఉవాచ. సిగరెట్టు తో పాటు ఇంగ్లీషువారు మనకి నేర్పిన మరో
అలవాటు కాఫీ. అందుకే కవిత్వానికి సిగరెట్టూ, కాఫీకే ఇది తోబుట్టూ అంటూ సిగరెట్టుకి, కాఫీ సేవనానికి
ముడిపెట్టి రెండూ తమలోని కళాకారులకి అవసరం అని చెప్తాడు.
ఆరోజుల్లో కాఫీ
తాగితే పైత్యం చేస్తుందని చాలామంది నమ్మేవారు. అందుకే ఆ భార్య ఈ సిగరెట్టుతో పాటు
ఆ కాఫీ కూడా కలిపితే ఇక పైత్యం ప్రకోపిస్తుందని హెచ్చరిస్తుంది. అలా సిగరెట్టుని
బడాయి కోసం గొప్పకోసం కాల్చి తనను గొప్పవాడిగా జమకట్టుకోవడం తప్పంటుంది.
సిగరెట్ కాల్చనిదే తమలో కొత్త సృష్టిచేసే ఆలోచన
రాదని నమ్మే వాళ్ళని మనసులో పెట్టుకుని కొసరాజుగారు రాసిన మాట – “ ఆనందానికి
సిగరెట్టు ఆలోచనలను గిలకొట్టు”
అని భర్తతో అనిపించడం. సాగరాన్ని మధిస్తే అమృతం
వచ్చింది. ఈ సిగరెట్ తన మనసు లోతుల్లో
ఆలోచనలను బాగా మధించి కొత్త సృష్టి చేస్తుందని దబాయించబోతాడు భర్త.
“ పనిలేకుంటే సిగరెట్టు – తిని కూర్చుంటే పొగపట్టు “ అంటూ ఆ సిగరెట్ వల్ల కర్తవ్య విమూఢులుగా మారిపోతారని, పని చేయాలనే ఉత్సాహం నశిస్తుందని, అలా పని పాటలేకుండా తినికూర్చోవడం వల్ల బద్ధకం పెరిగి సిగరెట్టు పొగ ఒళ్ళంతా పట్టి ఆరోగ్యం నాశనం అవుతుందని బెదిరిస్తుంది భార్య.
“ పనిలేకుంటే సిగరెట్టు – తిని కూర్చుంటే పొగపట్టు “ అంటూ ఆ సిగరెట్ వల్ల కర్తవ్య విమూఢులుగా మారిపోతారని, పని చేయాలనే ఉత్సాహం నశిస్తుందని, అలా పని పాటలేకుండా తినికూర్చోవడం వల్ల బద్ధకం పెరిగి సిగరెట్టు పొగ ఒళ్ళంతా పట్టి ఆరోగ్యం నాశనం అవుతుందని బెదిరిస్తుంది భార్య.
“రవ్వలు రాల్చే రాకెట్టూ, రంగు రంగుల పాకెట్టూ” అంటూ సిగరెట్ ని నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసే రాకెట్ తో పోల్చి,
ఆ సిగరెట్ల పాకెట్ రంగురంగుల పాకింగ్ ని మెచ్చుకుంటాడు భర్త.
సిగరెట్ తో ఆంజనేయుడు లంకా దహనం చేయడం ఏమో కానీ
అది తన భర్త ఆరోగ్యాన్ని పాడుచేసి చివరకు
తమ కొంప కాల్చే కొరివిలా మారబోతోందని కోపం తెచ్చుకుంటుంది భార్య. అందుకే ఆఖరి మాటగా చెప్పి అతని దగ్గర పేకెట్ తీసేసుకుని
–
“కొంపలు కాల్చే సిగరెట్టు, దీని గొప్ప చెప్ప
చీదరబుట్టు” అంటూ ఆ సిగరెట్ మీద తనకున్న కోపాన్ని
దాచుకోలేక అతని దగ్గరున్న పేకెట్ని తీసుకుని నలిపి పారేస్తుంది.
ఏదైనా
కార్యసాధనకు ‘ సామదాన భేద దండోపాయాలు ’ అంటూ చతుర్విధ ఉపాయాలు చెప్తారు పెద్దలు. ఈ
పాటలో సిగరెట్ మాన్పించడానికి భార్య చేసిన ప్రయత్నాలన్నీ అలాంటివే. కానీ సిగరెట్
మోజులో మునిగి ఉన్న భర్త ఆ ఉపాయాలకు లొంగడు. ప్రతి వాగస్త్రాన్ని ఖండిస్తూపోతాడు.
చివరకు కోపం హద్దుల కట్ట తెగి, భార్య ఆ
సిగరెట్ పాకెట్ తీసుకని నలిపి పడేయడంతో అక్కడికి కథ ముగుస్తుంది.
ఆ సంభాషణలోని ప్రతి
వాక్యం ఒక్కో చమత్కార రసగుళికలు. రెండు పాత్రల్లోను సమానమైన వాక్చమత్కృతి
వెల్లివిరుస్తుంది. ఆహా
ఓహో అనిపిస్తుంది. అందుకే సరదా సరదా పాటల్లో
ఉత్తమోత్తమమయిన సరదా పాట ఈ సరదా సరదా సిగరెట్టు పాట.
కొసరాజు
రాఘవయ్యగారి హాస్యస్ఫూర్తిని ప్రకటించడానికి రేలంగి గిరిజల హావభావ విన్యాసం, మాధవపెద్ది సత్యం జమునారాణి ల స్వర
విన్యాసం తోడయ్యి పాటని చిరంజీవిని చేసాయి. సిగరెట్, దాని పొగ నచ్చనివారుంటారేమో కానీ సిగరెట్టు మీద ఈ పాటని మెచ్చనివారుండరు
చిత్రం పేరు రాముడు భీముడు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.
.
Very nice infer mation
రిప్లయితొలగించండిSuper Song
రిప్లయితొలగించండి