21, అక్టోబర్ 2013, సోమవారం

ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!

ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!

ఓ తరానికి ఈ పాట అంటే మహా ఇష్టం. తెలుగు సినిమాలలో హాస్యం అంటే రేలంగే, రేలంగి అంటేనే హాస్యం. రేలంగిగారిమీద చిత్రించబడిన పాటల్లో ఇది ఒకటి.  రేలంగికి చాలామంది జంటగా నటించినా గిరిజతో నటించిన చిత్రాలు, పాటలు చాలా హిట్ అయ్యాయి. ప్రజలు ఆదరించిన జంట రేలంగి -గిరిజ. వారిద్దరి మీద చిత్రించబడిన గీతం ఇది.

ఈ పాట చిత్రీకరణ ఆరోజుల్లో ఎప్పుడూ ఉండేలా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టో, పార్కుల్లో డాన్సు చేస్తున్నట్టో కాకుండా ఒక జూపార్క్ లో చిత్రించబడడం విశేషం.

అమ్మాయి పల్లెటూరు అమ్మాయి. మంచి కట్టుబాట్ల మధ్య పెరిగింది. కొద్దిగా మోటుతనం, అమాయకత్వం నిండిన పడుచు. తండ్రి పల్లెటూరువాడైనా డబ్బు బాగా ఉంది కనుక కూతురుకి కొంచెం నాగీరకం నేర్పించి నాజూగ్గా కనిపించేలా  చెయ్యాలని, విదేశాలలో ఉండే డాక్టరుకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని కోరిక. అలాంటి అమ్మాయి పట్నవాసంలో పరిచయమయ్యాడు ఈ కుర్రవాడు. పట్నం చూపిస్తానంటూ ఇంటినుంచి బయటకి తీసుకువచ్చాడు. అదీ పాటకి సందర్భం.

 అబ్బాయి ఆ అమ్మాయికి వరసకి మామయ్య కాబట్టి -
 "ఓహోహో మామయ్యా ఇదేమయ్యా బలె బలెబాగా ఉందయ్యా.
ఇంటిని విడిచి షికారు కొస్తే ఎంతో హాయి కలదయ్యా...."
అంటూ తనకి  తండ్రి కట్టుబాట్ల మధ్యనుంచి దొరికిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఇంటిని విడిచి వచ్చి షికార్లు కొడుతున్నందుకు సంతోషం ప్రకటిస్తుంది.
అమ్మాయిని సంబోధిస్తూ ఆ మామయ్య తాము వచ్చిన చోటు గురించి చెప్తాడు.

"ఓహొహో అమ్మాయి ఇది కాలేజీ బలె బలె బతికిన కాలేజీ
మాటలురాని మృగాలు కొన్ని మనిషికి పాఠ చెబుతాయి"
అంటూ తాము జూ పార్క్ అని పిలవబడే జంతు ప్రదర్శనశాలకి వచ్చామని చెప్తాడు. జూలో బంధించబడిన జంతువులనుంచి మనం తెలుసుకోదగిన విషయాలెన్నో ఉన్నాయంటూ, "మాటలు రాని మృగాలు సైతం మనిషికి పాఠం చెబుతాయి "అంటాడు.

ఇక్కడ జూ పార్కుని బతికిన కాలేజీ అనే పదంతో ప్రయోగించడమే సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. చాలా ఏళ్ళపాటు ఆంధ్ర ప్రాంతాలలో  చాలామంది మద్రాసులోని జూని బతికిన కాలేజీ అని, మ్యూజియం ని చచ్చిన కాలేజీ అని పిలిచేవారు

పాలగుమ్మి పద్మరాజుగారు మొదటిగా  తన రచనలలో  మద్రాసు జూపార్కు గురించి రాస్తూ బతికిన కాలేజీ అనే పద ప్రయోగం చేసారని తెలిసింది. ఆ ప్రభావంతోనేమో ఆరుద్రగారు కూడా ఈ పాటలో జూపార్క్ ని బతికిన కాలేజీ అని సంబోధించారు. ఇది చాలా పాపులర్ అయింది కూడా. మద్రాసులో చూడదగిన స్థలాల జాబితాలో  బతికిన కాలేజీ, చచ్చినకాలేజీ అని చెప్పుకోవడం చాలామందికి తెలుసు.

పులి, సింహం వంటివి క్రూర జంతువులు. సాధుజంతువులను, మనుషులను వేటాడి భుజించే స్వభావం కలిగినవి. అవి అడవిలో నివసిస్తాయి. కానీ మనుషులు ఈవిధంగా వాటిని బోనుల్లో బంధించి ఉంచడం ఆ అమ్మాయికి ఆశ్చర్యం కలిగించింది. అందుకే-
"పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగితే ప్రమాదమే"
 అంటూ అందుకే వాటిని ఇలా జూలో బంధించారా? అని అడుగుతుంది. అందుకు ఆ మామయ్య ఇలా అంటాడు.

"కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు"
 అంటూ మనుషుల్లో ఉండే క్రూర స్వబావం జంతువుల క్రౌర్యాన్ని మించిపోయిందని చెప్తాడు.  అంతే కాక క్రౌర్యం పెరిగిన మనిషిని, మృగాన్ని కటకటాలలో పెడతారు అంటూ మనుషులలో క్రూర స్వభావం ఉన్నవారు చివరకు జైలు శిక్ష అనుభవిస్తారని ఓ మంచి నీతి పాఠం చెప్తాడు. జూలో జంతువులయినా, మనుషులలో నేరస్వభావం ప్రదర్శించిన వారైనా వారి నివాసం కటకటాల గదుల్లోనే అనే విషయాన్ని ఆరుద్ర ఎంతో చక్కగా చెప్పారు.

"గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రాది"
 అంటూ జూపార్క్ లోని జీబ్రా  అనే జంతువును చూపించి దాని లక్షణాన్ని ఆమెకి వివరిస్తాడు మామయ్య.  జీబ్రా చూడడానికి గాడిదలాగా ఉంటుంది. ఒళ్ళంతా నలుపురంగు నిలువు చారలుంటాయి. ఈ జీబ్రాపేరు లాటిన్ లో అడవిగుర్రం అనే అర్థంతో ఉండే పదం. అందుకే ఆరుద్రగారు జీబ్రాని అమ్మాయికి పరిచయం చేస్తూ గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రా అంటూ ఆమె ఎప్పుడూ చూడని జీబ్రాని చూపించాడు.
జిరాఫీ ని చూపిస్తూ

"చుక్కల జిరాఫీ ఒంటెకు బంధువు" అని చెప్పాడు. ఒంటె చాలా ఎత్తుగా బాగా సాగిన మెడతో ఉంటుంది. అందుకే చూడడానికి ఒంటెలా ఉండే ఆఫ్రికన్ జంతువు జిరాఫీ లేత పసుపురంగులో చుక్కలు నిండిన చర్మంతో బాగా ఎత్తుగా, పెద్ద తల మెడతో ఉంటుంది అందుకని దాన్ని ఒంటె కి బంధువు అంటూ వివరించాడు.
ఆ పక్కనే కోతి జాతికి చెందిన చింపాంజీలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ జిరాఫీ ఒంటెకి బంధువయితే "మనిషికి బంధువు  ఈ చింపాంజీ" అని పరిచయం చేసాడు. మనిషి  ఈ రూపంలోకి రావడానికి ముందు కోతి ఆకారంలో ఉండే జంతువునుంచి పరిణమించాడని డార్విన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతం. అందుకే ఎంతో కాలంనుంచి  మనమంతా "కోతి నుంచి పుట్టాడు మానవుడు" అంటూ నమ్ముతున్నాం.

ఆరుద్రగారు కూడా దీన్నే దృష్టిలో పెట్టుకుని మనిషికి బంధువు చింపంజీ అంటూ ఆ అమ్మాయికి చూపించారు. కోతులను దగ్గరగా గమనిస్తే అవి మనుషులను ఎంత చక్కగా అనుకరించగలవో చూడగలం. అందుకే
"మనుషుల చేష్టలు కోతులవైతే - కోతి చేష్టలు కొందరివి"
 అంటూ కోతులు జంతువులు కనుక  జంతు స్వభావంతో మనుషులను అనుకరించడం లాంటివి చేస్తాయి. కానీ మనుషులు కోతి కన్నా అభివృద్ధి చెందిన జీవులు. మెదడు పెరిగింది. అయినా కొందరు తను మనిషిని అన్నమాట మరిచిపోయి కోతుల్లా ప్రవర్తించడం గురించి ఇలా అన్నారు ఆరుద్ర. కోతి వేషాలు అంటూ ఆకతాయిగా ఉండే మనుషులగురించి మనం అనుకుంటూ ఉంటాం. దానిగురించే  ఆరుద్ర ఇక్కడ చక్కగా విడమర్చి చెప్పి చీవాట్లు పెట్టారు.
"తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది"
 అంటూ అమ్మాయి మామయ్యని ఓ జంతువును చూపించి అడిగింది.

"ఏనుగు వంటిది నీటిగుర్రము దానికి తమ్ముడు ఖడ్గమృగం " అని చెప్పాడు మామయ్య. ఏనుగు లాగా పెద్ద శరీరంతో నోరు ను బాగా తెరుస్తూ ఉన్న ఆ జంతువు ఏనుగులాగా పెద్దగా ఉన్నా దాని పేరు నీటిగుర్రము అని చెప్పాడు మామయ్య. అంతే కాక ఆ పక్కనే ఉన్న మరో జంతువు ఉంది. అది కూడా ఏనుగు లాగే భారీ శరీరంతో తిరుగుతోంది. దాన్ని చూపిస్తూ నీటిగుర్రంలాగే అది కూడా పెద్ద శరీరంతో ఉందని దాని పేరు ఖడ్గ మృగం అని చెప్పాడు.

ఇక్కడ మనుషుల స్వభావం మీద మరో చురకవేసారు ఆరుద్ర.
"అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకూ అలమే తింటాయి" అంటూ.
నీటిగుర్రం, ఖడ్గమృగం రెండూ ఏనుగు లాగా అతి భారీ శరీరాలున్న జంతువులే కానీ అవి కేవలం ఆకూ అలములు తిని బతికే శాకాహార జంతువులు. మనుషుల్లో అధికులు అంటే సంపన్నులు పేదవారిని దోచుకుని తింటూ వారి రక్తమాంసాలను కష్టం రూపంలో దోచుకుని తమ సంపదను పెంచుకుంటారు. నీటిగుర్రం, ఖడ్గమృగం ఆకారంలో అధికమే అయినా అవి సాత్వికమైనవే అని చెప్తూ మనిషిలోని దుర్గుణాన్ని ఎత్తిచూపించారు.

జూ పార్క్ లో సందర్శకులు ఏనుగుపైన ఎక్కి ఒకసారి విహరించడానికి అవకాశం కల్పిస్తారు జూ వారు. ఆ మామయ్య, అమ్మాయి అలా ఆ జూలో ఏనుగును ఎక్కారు. ఏనుగుఅంబారీ ఎక్కడం అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదు కదా. పాతకాలంలో రాజులు, చాలా గొప్పవారు మాత్రమే ఏనుగును ఎక్కగలిగేవారు. అందుకే అమ్మాయికి పట్టలేని సంతోషం కలిగింది.కానీ " రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా" అంటూ రాజులు ఎక్కే అంబారీపైన సామాన్యులమైన తమలాంటి వారు ఎక్కి తిరగడం తప్పేమో అనే అమాయకపు ఆలోచనతో మామయ్యని అడిగింది.


మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఒకప్పుడు మాహారాజులు పరిపాలించిన ప్రాంతాలన్నిటా రాజరికం పోయి  ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులతో నడిచే ప్రభుత్వాలు వచ్చాయి. అదే ప్రజా స్వామ్యం.  అందుకే ఆరుద్ర  ఇక్కడ-
" రాజులు పోయి రోజులు మారి ప్రజలే ప్రభువులు ఈనాడు "
అంటూ భారతదేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాన్ని  మామయ్యతో చెప్పించి అమ్మాయికి పరిచయం చేసారు.
ఒహొహో మామయ్యా ఇదేమయ్యా అంటూ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు, ఒహొహో అమ్మాయి అంటూ ప్రతి సంబోధనతో మామయ్యతో జవాబులు చెప్పించిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ సరదా పాటల్లో మేటిగా నిలిచింది.

పాట రచన   ఆరుద్ర(భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)
చిత్రం          ఆరాధన
గానం         ఘంటసాల , పి. సుశీల
అభినయం   గిరిజ, రేలంగి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి