17, ఏప్రిల్ 2016, ఆదివారం

సీతాపతి సంసారానికి చిచ్చుపెట్టిన చాకలితిప్పడి పాట!!

రామాయణం రసవద్భరితమైన కమనీయ కావ్యం. అందులో సీతా పరిత్యాగ ఘట్టం అంత కరుణరసప్లావితమైన ఘట్టం మరొకటి ఉండదు. లోకాపవాదానికి భయపడి శ్రీరాముడు సీతను పరిత్యజించడానికి పూనుకుంటాడు.
రామో విగ్రహాన్ ధర్మః అంటారు. మూర్తీభవించిన ధర్మమే రాముడు.ప్రజలను పాలించే రాజు ధర్మంతప్పకూడదని రాముడు నమ్మాడు. ధర్మంకోసం ప్రాణప్రదమైన భార్యను వదులుకున్నాడు.
ఎంతో అన్యోన్యంగా ఉండే సీతారాములను ఈ విధంగా విడదీయడానికి కారణమైన ఒక గొప్ప సంఘటన-రాజ్యంలోని ఒక చాకలివాడు శ్రీరాముడి గురించి చేసిన ఒక వ్యాఖ్యానం. ధర్మాన్ని పాటించే రాజుగా రాముడు  సీతా పరిత్యాగం చేసి తీరవలసిన సందర్భాన్ని కల్పించారు వాల్మీకి. ఈ సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా, రామాయణంలోని మూలకథకు భంగం కలగకుండా చక్కగా చిత్రించారు లవకుశ సినిమాలో.
ఊరికే ఒక చాకలి ఒక మాట అన్నట్టు చూపించినా ప్రేక్షకులకి తెలుస్తుంది. కానీ చాకలి పాత్రను, అతని భార్య పాత్రను కథలో ప్రముఖంగా తీసుకువచ్చి హాస్యం  పుష్కలంగా పండించి క్రమంగా కరుణరస ఘట్టంలోకి తీసుకువెళ్తారు. చిత్రదర్శకులు, సంగీత దర్శకుడు, అభినయం చేసిన నటులు అందరి ప్రతిభతో చక్కని హాస్యగీతంగా  ఇది చిత్రించబడింది.
చాకలివాడి పాత్రకు రెండు పాటలు పెట్టారు. వెయ్యర దెబ్బా  - అనే ముందు పాటలో అంటూ చాకలి వారి పనిపాట్లు, జీవన విధానం ముందుగా పరిచయం చేస్తారు. పాటలోనే చాకలివాడికి తన భార్య పట్ల తెగ అనుమానం అనే విషయం స్పష్టం అవుతుంది.ఎప్పుడూ భార్య తనతోనే ఉండాలని అనుకుంటాడు. భార్య ఎటు చూసినా అనుమానిస్తూ ఉంటాడు. అందుకే " అటేపు చూస్తావ్, చిటికెలు వేస్తావ్ - అటెవ్వరున్నారే మిటికరించి నను మిర్రున చూసి మెటికలిరుస్తావెందుకు" అని పదే పదే అడుగుతుంటాడు. " అదేమి మాట మామా, అలాగంటావు నేను అలాంటి దాన్ని కాదు" అంటుంది. అప్పకూతురువని సరసమాడాను అని తన మాటలని సమర్థించుకుంటాడు.  భార్యాభర్తలమధ్య సయోధ్యలేదని ఈ పాట ద్వారా తెలుస్తుంది. మరి కొద్ది కాలం తర్వాత జరిగిన మరొక సంఘటనే ప్రధాన కథను ముందుకు తీసుకు వెళుతుంది. 

పాట ప్రారంభంలో చాకలివాడు తన భార్య ఇంట్లో లేదని ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.ఎండుమిరపకాయలు నములుతూ కోపం పెంచుకొని, తన భార్యరాగానే ఆమెను కొట్టాలని చూస్తూ ఉంటాడు. రాగానే ఎక్కడికెళ్లావు అని అడుగుతాడు. తన అప్పగారి ఇంటికి వెళ్లానని చెప్తుంది భార్య.ఆమెమాటలు నమ్మడు. ఆమెని నరికేస్తానంటూ మీదపడతాడు. చుట్టుపక్కల అంతా చేరతారు. భార్యకి తల్లి,( తనఅక్కే) అత్తగారు, మామగారు వస్తారు అల్లుడికి సర్ది చెప్పడానికి.
"నాకు మీ పిల్ల ఇక వద్దు మీరే తీసుకుపొండి" అంటూ ప్రారంభిస్తాడు చాకలి.

 చాకలి      ఒల్లనోరి మామా నీ పిల్లని
               నేనొల్లనోరి మామా నీ పిల్లని
               అబ్బా నీ పిల్లా  దీని మాటలెల్ల కల్లా
              సంసారమంత  గుల్లా
ఆ భార్యమీద అనుమానం కదూ  - నేనింక నీ పిల్లని భరించలేను. అన్నీ అబద్ధాలే చెబుతుంది. నీ కూతురి మాటలు వింటే ఇక సంసారం గుల్ల అవుతుంది నాకీ భార్య వద్దు అంటాడు.
భార్య         నన్నొల్లనంతవెందుకు మామయ్యా
               నావల్ల నేరమేమిర అయ్యయ్యో
               దయ్యమని కొడుదనా దేవతని కొడుదునా
                నూతిలోన పడుదునా గోతిలోన పడుదునా
అంటూ చాకలి భార్య భర్తను మంచి చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ' నావల్ల నేరమేమిటి' అంటూ అమాయకంగా తనకేం తెలియదని బుకాయిస్తుంది. 'నువ్వు నన్ను అనవసరంగా నిందిస్తున్నావు. నీ స్వభావం ఏమిటో, నువ్వు పెట్టే బాధలు, నీ మాటలు భరించలేకుండా ఉన్నాను. నుయ్యో గొయ్యో చూసుకోవాలి నేనింక' అని బెదిరిస్తుంది.
చాకలి         చవటకారి నాయాలా ఊరుకో
                 సూరిగాడి ఇంటికాడ చూడలేదటే నిన్ను
                 మారుమాటలాడతావ, మాయదారి గుంటా
                 నిను సూత్తె  ఒళ్ళుమంట
కానీ అప్పటికే భార్య మీద అనుమానమే కాదు, తగిన సాక్ష్యం కూడా సంపాదించి ఉన్నాడు చాకలి.ఆమె మీద కోపం అంతా చవటకారి నాయాలా అంటూ ఒక్క తిట్టులో చూపించాడు. అంతకు ముందే ఆ ఊళ్ళో ఉన్న సూరిగాడి ఇంటిదగ్గర భార్యను చూసాడు. భార్యకి ఆ విషయం తెలియదు. అందుకే తన అక్కగారింటినుంచి వస్తున్నానని అబద్ధం చెప్పింది. తాను ఆమెను చూసానన్న విషయం చెప్పి 'మాయదారి మాటలతో ఇక నన్ను మభ్యపెట్టలేవు' అంటూ ఆమెను అసహ్యించుకొని తన కోపాన్ని చూపిస్తాడు.
మామగారు    నామాటినురా బాబూ.....ఓ రల్లుడ మేనల్లుడ.... మా అప్పగోరి పిల్లడా
                             అయిందానికల్లరెందుకల్లుడా ఓరల్లుడ మేనల్లుడ
                            నీ అప్ప ముగం చూడర మా అమ్మిని కాపాడరా
ఇక  మూడోమనిషి జోక్యంతో కానీ ఇది చక్కబడేలా లేని స్థితికి వచ్చిందని గ్రహిస్తాడు మామగారు. నామాటినురా బాబూ అంటూ బతిమాలుతూ  ఓ అల్లుడా, మేనల్లుడా, మా అప్పగోరి పిల్లడా అంటూ తన అక్కకొడుకే అల్లుడు కనుక తమ పిల్ల తప్పు చేసినా క్షమించమని కాళ్లబేరానికి వస్తాడు. ఏదో అనుకోకుండా తప్పు జరిగిపోయింది. ఇంకా అల్లరి చేసుకుని చుట్టుపక్కలవారి మధ్య అవమానం పాలవడం ఎందుకు అని సర్దిచెప్పచూస్తాడు. అల్లుడు తనకేమో అక్క కొడుకు, మేనల్లుడు. ఆ అక్కగారి కూతుర్నే తను చేసుకున్నాడు. అంటే అల్లుడు అక్క కొడుకు, భార్యకి తమ్ముడు. ఇంత దగ్గరి బంధువు. పిల్ల తెలియకుండా తప్పుచేస్తే క్షమించడం కూడా తప్పదుమరి అని బతిమాలుతూ తమ బంధుత్వాన్ని గుర్తుచేస్తాడు.
"నేనొల్లనోరి మామా నీ పిల్లని" అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు అల్లుడు.వరుసకి బావ,మామగారు అయిన ఆ మనిషి ఎంత చెప్పినా తన పట్టుదల వదులుకోడు చాకలి. 
ఇక లాభం లేదని అక్కగారు రంగంలోకి దిగింది.
చూడూ.........తప్పేమి చేసింది తమ్ముడా
ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా
తప్పతాగి ఉన్నావు చెప్పుడు మాటిన్నావు
అప్పడగబోయింది అదీ ఒక తప్పా..ఏరా
అక్క కాబట్టి ఆప్యాయంగా ఏరా అంటూ సంబోధిస్తుంది. తన కూతురు ఇంటి దగ్గర లేకపోవడాన్ని సమర్థించుకుంటూ ఓ కారణాన్ని కల్పించింది. " అప్పు అడగడం కోసం వాడి ఇంటికి వెళ్ళింది కానీ అదీ ఓ పెద్ద తప్పులా చూపిస్తావేం" అని  చనువుగా గదమాయించింది. పైగా తాగి ఉన్నావు అందుకే నీకు మంచి చెడు తెలియడం లేదు- అంటూ అల్లుడయిన తమ్ముణ్ని అక్కగా తన అధికారం చూపించింది.
అప్పా ఓ లప్పా నీ మాటలు నేనొప్పా ఇక చాలును నీగొప్పా
నా ఆలిగుణం ఎరుగనటే........ ఏలు కోను తీసుకుపో
ఎక్కడైనా బావేకానీ వంగతోటకాడ మాత్రం కాదు -అన్నట్టు ఉన్నాడు తమ్ముడు. అప్పా ఓలప్పా అని అక్కను పిలిచి ఎన్ని చెప్పినా నా భార్య గుణం నాకు తెలుసు, నేనింక ఆమెను ఏలుకోబోయేది లేదు అని తెగేసి చెప్పాడు.
తల్లి తండ్రి చెప్పినమాటలతో భర్తలో మార్పు వస్తుందని చూసింది చాకలి భార్య. కానీ ఏం  ప్రయోజనం లేకపోయింది. అంతవరకూ గట్టి స్వరంతో మాట్లాడినది కాస్తా ఇక స్వరం తగ్గించి బతిమాలడం మొదలు పెట్టింది. తాగుబోతువై  నా మీద నిందలు వేస్తున్నావు. నేను సత్యమైన ఇల్లాలిని చూడు అంటూ ప్రమాణాలు చేయడం మొదలు పెట్టింది.
నీ తాగుపోతు మాటలింక మానరా
నే సత్తెమైన ఇల్లాలిని చూడరా
నేనగ్గి ముట్టుకుంటా తలమీద పెట్టుకుంటా
అంటుంది.రాముడు అనుమానించినప్పుడు  సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. అందువల్ల తానూ కూడా అలాగే చేస్తానంటుంది.
వెర్రి రాముడంటి ఓణ్ణి కానులే
గొప్ప శౌర్యమున్న ఇంట పుట్టినానులే
నువ్వగ్గిలోన పడ్డా బుగ్గిలోన పడ్డా
పరాయింట ఉన్నదాన్ని పంచచేరనిస్తానా
ఈ ఆఖరి చరణం రాముడి పాత్రపై ఒక చాకలి చేసే వ్యాఖ్యానం. ఎంత గొప్పగా రాసారో సదాశివ బ్రహ్మంగారు. తాను రాముడిలావెర్రివాడిని కాను అంటాడు. గొప్ప శౌర్యమున్న ఇంట పుట్టినాను అంటాడు. అంటే రాముడు పనికిరానివాడు, వీర్యగుణం లేనివాడు అనే కదా అర్థం. .రాముడు వఠ్ఠి తెలివితక్కువవాడని, బుద్ధిలేని పని చేసాడని, భార్య పరాయివాడిదగ్గర అన్నిరోజులు ఉన్నా తిరిగి తెచ్చుకున్నాడని ఛీత్కారంగా మాట్లాడతాడు. భార్యతో - నువ్వు సీతలాగా అగ్గిలో పడి అగ్ని ప్రవేశం చేసినా, బుగ్గిలోన పడి బూడిద అయిపోయినా సరే,  పరాయి ఇంటినుంచి వచ్చినదానివి నిన్ను నా ఆశ్రయం లో ఉండనిస్తానా....ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నా ఇంట ఉంచుకోను. నిన్ను నా భార్యగా అంగీకరించను అని తెగేసి చెప్తాడు
సీతా పరిత్యాగానికి రంగం సిద్ధం అయింది. జరిగిన, జరగుతున్న విషయాలేవీ తెలియని సీతను లక్ష్మణుడు వనభూములలో వదలడం, చెప్పలేక చెప్పలేక అన్నగారి ఆజ్ఞను ఆమెకి వివరించడం, సీత హతాశురాలై మూర్ఛపోవడం, వాల్మీకి ఆశ్రమంలో చేరడం తరువాత వచ్చే కరుణరసాత్మకమైన సంఘటనలు. ముందు సీతారాముల అనురాగభరితమైన సన్నివేశాలతో శృంగార రసాన్ని ఆవెంటనే  రాముడిపై చాకలివాడి వ్యాఖ్యలతో సీతా పరిత్యాగ ఘట్టానికి నాంది పలుకుతూ మధ్యలో సన్నివేశాన్ని హాస్యరసంతో చిత్రించారు. చాకలి, అతని భార్య, అక్క, బావ ఉండే ఈ ఘట్టానికి చక్కని  పాత్రోచితమైన భాషతో ఈ గీతాన్ని రాసారు సదాశివబ్రహ్మంగారు. 

రాముడు అంత కఠోరమైన నిర్ణయం తీసుకోవడానికి, చాకలి వాడి జీవితంలో జరిగిన సంఘటనను సామ్యంగా చూపించి, ఒక సాధారణ పౌరుడి సంభాషణ ద్వారా దానికి నాంది పలికించారు. అగ్గిలోనపడి తన ప్రవర్తనలో దోషం లేదని నిరూపించుకుంటానని భార్య అంటే,  నువ్వు ఎక్కడ పడినా నాకు నువ్వు వద్దు అని చెప్పడమే కాకుండా నేను రాముడిలా వెర్రివాడిని కాదు అనిపించడం, నేను శౌర్యవంతుడిని అని చాకలివాడు  చెప్పడం,   తర్వాత కథలో రాముడు తీసుకునే నిర్ణయానికి మూల హేతువులు అయ్యాయి.
 చక్కని పాత్రోచితమైన సంభాషణలతో హాస్యరసం పండిస్తూ,కథను ముందుకు నడిపే ప్రయోజనం కోసం సృష్టించబడి, చక్కగా నిర్వహించబడింది ఈ పాట. రచయిత మాటలతో సృష్టించిన హాస్యాన్ని తమ హావభావ విన్యాసాలతో ఎంతో చక్కగా అభినయించి  పాటకి పూర్తి న్యాయం చేకూర్చారు నటీనటులందరూ. హాస్యభరితమయిన పాటల మణిహారంలో గొప్ప కాంతులీనే మణిపూస ఇది. తీసి అరవయ్యేళ్లయినా జనాదరణ తగ్గని పాట.
చిత్రం   లవకుశ
పాత్రలు చాకలి తిప్పడుగా రేలంగి, అతని భార్యగా గిరిజ. మామగారుగా డా.శివరామకృష్ణయ్య .
గానం ఘంటసాల , జె.వి రాఘవులు, జిక్కి, రాణి.

25, అక్టోబర్ 2013, శుక్రవారం

కొసరాజు చమక్కులు - సిగరెట్టు చురుక్కులు !!

కుక్కపిల్లా,  సబ్బు బిళ్ళా, అరటితొక్కా, బల్లచెక్కా ఏదీ కవిత్వంలో వస్తువుగా అనర్హం కాదన్నారు శ్రీశ్రీ. ఉదాత్తమైన వస్తువు మాత్రమే కవితా వస్తువుగా ఉండాలని మన ఆలంకారికుల నమ్మకం. కానీ సమాజంలో తేలికగా చూడబడే సిగరెట్టు లాంటి  వస్తువు  మీద "న భూతో న భవిష్యతి"
 అన్నట్టు  అమోఘమైన పాట రాసారు కొసరాజుగారు. సరదా పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాటల్లో ఇది మరీ ఉత్తమమైన కోవకు చెందుతుంది

సిగార్ అంటే ఎండిన పొగాకును చుట్టగా చుట్టినది అని అర్థం. ఆ చుట్టని నైస్ గా చిన్నగా చుడితే అదే సిగరెట్. మన తెలుగుభాష మర్యాద ప్రకారం ద్విరుక్తం చేసి సిగరెట్టుగా చేసుకుని వాడుకుంటున్నాం.
.
సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ 
 పట్టుబట్టి ఓ దమ్ములాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు"
అంటూ ఓ భర్తగారు గుఫ్పు గుఫ్ఫుమని పొగను పీలుస్తూ వదులుతూ స్వర్గం లో తేలుతున్నట్టుగా మురిసిపోతుంటాడు.  భర్త దగ్గరకు వచ్చిన భార్య  సిగరెట్టు పొగలు చుట్టుముట్టగా ఉక్కిరి బిక్కిరవుతుంది.  ఆ సందర్భంలో సిగరెట్టు మంచి చెడులను ఎవరికి వారు సమర్థించుకుంటూ  విమర్శించుకుంటూ సంభాషించుకునే  పాట ఇది.  తనకి భర్తలో నచ్చని ఈ ధూమపానసేవనం నుంచి ఎలాగయినా మరల్చాలని భార్య ప్రయత్నించడం,  ఎన్నో వాగ్బాణాలను విసరడం, భర్త వాటిని తెలివిగా తిరగ్గొట్టడం ఈ క్రమంలో కొసరాజుగారి చమక్కులు ప్రేక్షకులకి, శ్రోతల మనసులకి చురుక్కమనిపంచడం, మనసుల్లో హాసపు మెరుపులు చమక్కుమనడం షరా మామూలే.

భారతీయుల్లో ఉన్న పెద్ద అవలక్షణం -  విదేశీ వస్తువుల పట్ల మోజు. మన దేశంలో పొగాకు కు ఈ విధమైన వినియోగాన్ని పరిచయం చేసినవారు బ్రిటిషర్లు.  బ్రిటిష్ దొరలు ఓ పైప్ నోట్లో వేసుకుని పొగను పీలుస్తూ  వదులుతూ అధికారం ప్రదర్శిస్తూ దర్జాగా ఆర్డర్లు వేస్తుంటే  ఆ దొరల స్టైల్ కి దాసోహమన్నారు చాలామంది. అందుకే అలా విలాసంగా, కులాసంగా కనిపించడానికి వారిని అనుకరిస్తూ ఈ సిగరెట్ తో  పొగతాగడంలోని ఆనందాన్ని ఊరికే రుచి చూడడానికి ప్రారంభించి చివరకు దానికి దాసోహం  అన్నారు.  దొరల్ దాగు బల్ సిగరెట్టూ అంటూ ఆ భర్త సీమ దొరలను మెచ్చుకోవడం లో ఈ ఫాషన్ అనుకరణని చూపించారు కొసరాజు.


తన కంపు తనకే ఇంపు కానీ ఇతరులకు కాదు కదా. భార్యకి ఆ సిగరెట్ వాసన కంపుగా కనిపిస్తుందందుకే.
కంపుగొట్టు ఈ సిగరెట్టు కాల్చకోయి నా పై ఒట్టుఅంటూ సెంటిమెంట్ తో అతన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తుంది.  మనిషి మీద ఒట్టు వేసి, ఆ పై మాట తప్పితే ఒట్టువేయబడిన మనిషికి ప్రాణం మీదకి వస్తుందని మన నమ్మకం.  అందుకే తన మీద ఒట్టు వేస్తే భర్త  ఆ పాడు సిగరెట్టు కాల్చే అలవాటు మానుకుంటాడేమోనని ఆమె ఆశ. కానీ ఆ భర్త ఒట్టు వేయడానికి ఒప్పుకుంటేనా.


కడుపు నిండునా కాలునిండునా వదిలి పెట్టవోయ్ నీ పట్టు అంటూ బతిమాలడం మొదలు పెట్టింది. కడుపునిండుతుందా, కాలు నిండుతుందా  అంటూ ఏదైనా ప్రయోజనం లేని పనికి వాడే జాతీయాన్ని ఈ భార్య పాత్రతో అనిపించడం  ఎంతో చక్కని ప్రయోగం.

సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేసాడు అంటూ సిగరెట్టు గొప్పదానాన్ని వివరించబోతాడు. ఆంజనేయుడు తన తోకకు నిప్పంటించుకుని లంకను దహనం చేసాడు.  ఆ పురాణ గాథని వక్రీకరించి భార్యకి సిగరెట్టు మంటతోనే ఆంజనేయుడు లంకాదహనం చేసాడని, అది అతి పవిత్రమైనదని  చెప్పి ఆమెను ఒప్పించాలనుకున్నాడు. కానీ భార్య అతను  అనుకున్నంత అమాయకురాలు కాదు. అందుకే – “ఎవడో కోతలు కోసాడు అంటూ ఆ కల్లబొల్లి మాటలు నమ్మడం మీ తెలివితక్కువ అన్నట్టుగా ఖండించేసింది.
ఇక సిగరెట్ కాల్చడాన్ని ఓ సరదా వ్యాపకంగా చేసేవారు కొందరయితే దాన్ని ఓ మహా కళారాధనగా చేసేవారు మరికొంతమంది. ఈ సిగరెట్ పొగను బయటికి వదలడంలో రింగులు రింగులు తిరిగేలా మబ్బుల్లా కనిపించేలా చేయడం ఓ కళగా అభ్యసిస్తారు కొందరు. అలాంటివారిగురించే  ఈ మాట.

ఈ  పొగతోటి గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు అని ఓ గొప్ప కళాసృష్టి చేయబోతున్నట్టు భార్యకి చూపించబోతాడు. కానీ భార్య దాన్ని తేలిగ్గా కొట్టిపారేసింది. అలాంటి పనులు చేయబోయి, చేతకాక మీసాలు కాల్చుకోవచ్చు అంటూ జరగబోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. నిప్పును నోట్లో పెట్టుకుని ఆటలు ఆడితే నోటిమీద మీసాలు కాలే ప్రమాదం ఎంతేనా ఉంది మరి.

కన్నెపిల్లలుగా ఉన్నప్పటినుంచే ఆడవాళ్ళు మంచి భర్తకోసం, అతని ఆరోగ్యం కోసం, క్షేమంకోసం లక్షా తొంభై నోములు నోస్తారు. వ్రతాలు చేస్తారు. అలాంటిది తన కళ్ళముందే ఆ భర్త ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సిగరెట్లను ఊదొత్తుల్లా వెలిగిస్తుంటే భార్య మనసు ఎంత దుఃఖపడుతుందీ. అందుకే అంటుంది ఆ బార్య-

ఊపిరితిత్తుల కాన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లూ
అంటూ అతని  ఆరోగ్యం గురించి హెచ్చరికలు చేస్తుంది. .

 కానీ ప్రజలందరూ నిత్యం కొలిచే తెర వేల్పులు  మన హీరోలు.  ఈకంపెనీ సిగరెట్లు కాల్చండి అంటూ పెద్ద పెద్ద హోర్డింగుల మీద నిలబడి చిద్విలాసంగా సిగరెట్లు కాల్చే ఫోటోలు ఎన్నో చూసాడు సదరు భర్తగారు. అందుకే ఆ డాక్టర్ల కన్నా తాను అభిమానించే తన యాక్టర్ల మాటనే నమ్ముతాడు. అంత గొప్ప యాక్టర్ సిగరెట్ కాలుస్తూ తనని కూడా కాల్చమని సలహా ఇస్తుంటే వద్దనడంలో ఏమీ సహేతుకం కనిపించదు అతనికి. 

ఆ రోజుల్లో యస్వీ రంగారావుగారు బర్కిలీ సిగరెట్లకి బ్రాండ్ ఎంబాసిడర్ అట. ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలిసినదే. ప్రజలు తమ అభిమాననటుల మాటలనే ఎక్కువగా నమ్ముతారని కంపెనీలకి తెలుసుకనుకే టాప్ నటులందరితోను తమ వస్తువులకి ప్రకటనలు గుప్పిస్తారు. ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి నటుల పోజు చూసి సిగరెట్లు అలవాటు చేసుకున్నవారు వేలాదిగా ఉన్నారు ఆంధ్రదేశంలో.  అందుకే  -

కాదన్నారులే పెద్ద యాక్టర్లు అంటూ భార్య మాటలకి రైమింగ్ గా జవాబు చెప్తాడు. 
సిగరెట్ పొగ గుండెలనిండా కమ్ముకుని బాగా పసరులా చేరి, కఫం పేరుకుని  ఊపిరితిత్తులను పనిచేయకుండా  చేసి క్రమంగా ఉసురుతీస్తుందని ఎంతో బాధగా చెప్తుంది భార్య. అవన్నీ తెలివితక్కువ దద్దమ్మలు మాత్రమే వినే మాటలని తనకి తెలివి ఉందని ఆమె మాటని కొట్టిపారేస్తాడు.

సిగరెట్ కాల్చేవారికి దాని పొగ సుగంధ పరిమళాలు వెదజల్లవచ్చు. కానీ ఆ పొగను పీల్చేవారి దురవస్థ వారికేం పడుతుంది. మిత్రులు తెలిసినవారు,  సిగరెట్ తాగుతుంటే పక్కనున్నవారు  ముక్కు మూసుకుంటే మర్యాదగా ఉండదేమోనని మొహమాట పడేవారుంటారు.  ఆ కంపు భరించలేక  ఆ మాట చెప్పలేక  ముక్కులు ఎగరేస్తారు.
కానీ ఈ విషయాన్ని తనకు కావలసినట్టు అర్థం చేసుకుంటారు ధూమపానిస్టులు. అందుకే

పక్కనున్నవారు దీని సువాసనకు ముక్కులు ఎగరేస్తారు
 నీవెరుగవు దీని హుషారు
 అంటూ ఆమెకి పరమళాన్ని గుర్తించే శక్తిలేకపోవడమేమిటో నని ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ఈ కంపు భరించలేకనే ధియేటర్లలో ధూమపానాన్ని నిషేధించారని అతన్ని వారించబోతుంది భార్య. ధియేటర్లలో ఈ ధూమపాన నిషేదం ప్రకటించినదగ్గర్నించే సినిమాలకు డబ్బులు వసూళ్ళు తగ్గిపోయాయని ఆ అస్త్రాన్ని తిప్పికొడతాడు భర్త. ఇది తిరుగులేని అస్త్రం మరి. సినిమాలు బాగా ఆడకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ధూమపానం పైన నిషేధమే దానికి కారణమని చెప్పడం కొసరాజు గారి చమక్కు.

నిరుపహతి స్థలమూ, రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురపువిడెమూ -  అంటూ  కవిత్వం రాయడానికి బోల్డు వస్తువులు అమరాలి అని పెద్దనగారు ఓ జాబితా చదివారు. అందులో  ఆధునికులు చేర్చుకున్న కొత్త వస్తువు సిగరెట్టు. సిగరెట్టు ముట్టించి రెండు దమ్ములు పీలుస్తే కానీ మంచి కవిత్వం రాయలేమని చాలామంది కవుల ఉవాచ. సిగరెట్టు తో పాటు ఇంగ్లీషువారు మనకి నేర్పిన మరో అలవాటు కాఫీ.  అందుకే  కవిత్వానికి సిగరెట్టూ, కాఫీకే  ఇది తోబుట్టూ అంటూ సిగరెట్టుకి, కాఫీ సేవనానికి ముడిపెట్టి రెండూ తమలోని కళాకారులకి అవసరం అని చెప్తాడు.

ఆరోజుల్లో కాఫీ తాగితే పైత్యం చేస్తుందని చాలామంది నమ్మేవారు. అందుకే ఆ భార్య ఈ సిగరెట్టుతో పాటు ఆ కాఫీ కూడా కలిపితే ఇక పైత్యం ప్రకోపిస్తుందని హెచ్చరిస్తుంది. అలా సిగరెట్టుని బడాయి కోసం గొప్పకోసం కాల్చి తనను గొప్పవాడిగా జమకట్టుకోవడం తప్పంటుంది.

 సిగరెట్ కాల్చనిదే తమలో కొత్త సృష్టిచేసే ఆలోచన రాదని నమ్మే వాళ్ళని మనసులో పెట్టుకుని కొసరాజుగారు రాసిన మాట – ఆనందానికి సిగరెట్టు ఆలోచనలను గిలకొట్టు అని భర్తతో అనిపించడం. సాగరాన్ని మధిస్తే అమృతం వచ్చింది. ఈ సిగరెట్ తన మనసు  లోతుల్లో ఆలోచనలను బాగా మధించి కొత్త సృష్టి చేస్తుందని దబాయించబోతాడు భర్త.

పనిలేకుంటే సిగరెట్టు – తిని కూర్చుంటే పొగపట్టు అంటూ ఆ సిగరెట్ వల్ల కర్తవ్య విమూఢులుగా మారిపోతారని, పని చేయాలనే  ఉత్సాహం నశిస్తుందని,  అలా  పని పాటలేకుండా తినికూర్చోవడం వల్ల బద్ధకం పెరిగి సిగరెట్టు పొగ ఒళ్ళంతా పట్టి ఆరోగ్యం నాశనం అవుతుందని బెదిరిస్తుంది భార్య.
రవ్వలు రాల్చే రాకెట్టూ, రంగు రంగుల పాకెట్టూ అంటూ సిగరెట్ ని నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసే రాకెట్ తో పోల్చి, ఆ సిగరెట్ల పాకెట్ రంగురంగుల పాకింగ్ ని మెచ్చుకుంటాడు  భర్త.
 సిగరెట్ తో ఆంజనేయుడు లంకా దహనం చేయడం ఏమో కానీ అది  తన భర్త ఆరోగ్యాన్ని పాడుచేసి చివరకు తమ కొంప కాల్చే కొరివిలా మారబోతోందని కోపం తెచ్చుకుంటుంది భార్య. అందుకే  ఆఖరి మాటగా చెప్పి అతని దగ్గర పేకెట్ తీసేసుకుని –
కొంపలు కాల్చే సిగరెట్టు, దీని గొప్ప చెప్ప చీదరబుట్టు అంటూ ఆ సిగరెట్ మీద తనకున్న కోపాన్ని దాచుకోలేక అతని దగ్గరున్న పేకెట్ని తీసుకుని నలిపి పారేస్తుంది.

ఏదైనా కార్యసాధనకు  సామదాన భేద దండోపాయాలు ’   అంటూ చతుర్విధ ఉపాయాలు చెప్తారు పెద్దలు. ఈ పాటలో సిగరెట్ మాన్పించడానికి భార్య చేసిన ప్రయత్నాలన్నీ అలాంటివే. కానీ సిగరెట్ మోజులో మునిగి ఉన్న భర్త ఆ ఉపాయాలకు లొంగడు. ప్రతి వాగస్త్రాన్ని ఖండిస్తూపోతాడు. చివరకు కోపం హద్దుల కట్ట తెగి, భార్య  ఆ సిగరెట్ పాకెట్ తీసుకని నలిపి పడేయడంతో అక్కడికి  కథ ముగుస్తుంది.

ఆ సంభాషణలోని ప్రతి వాక్యం ఒక్కో చమత్కార రసగుళికలు. రెండు పాత్రల్లోను సమానమైన వాక్చమత్కృతి వెల్లివిరుస్తుంది. ఆహా  ఓహో  అనిపిస్తుంది. అందుకే సరదా సరదా పాటల్లో ఉత్తమోత్తమమయిన సరదా పాట ఈ సరదా సరదా సిగరెట్టు పాట.

కొసరాజు రాఘవయ్యగారి హాస్యస్ఫూర్తిని ప్రకటించడానికి  రేలంగి గిరిజల  హావభావ విన్యాసం, మాధవపెద్ది సత్యం జమునారాణి ల స్వర విన్యాసం తోడయ్యి పాటని చిరంజీవిని చేసాయి. సిగరెట్, దాని పొగ నచ్చనివారుంటారేమో కానీ సిగరెట్టు మీద ఈ పాటని మెచ్చనివారుండరు
చిత్రం పేరు రాముడు భీముడు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.


.






21, అక్టోబర్ 2013, సోమవారం

ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!

ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!

ఓ తరానికి ఈ పాట అంటే మహా ఇష్టం. తెలుగు సినిమాలలో హాస్యం అంటే రేలంగే, రేలంగి అంటేనే హాస్యం. రేలంగిగారిమీద చిత్రించబడిన పాటల్లో ఇది ఒకటి.  రేలంగికి చాలామంది జంటగా నటించినా గిరిజతో నటించిన చిత్రాలు, పాటలు చాలా హిట్ అయ్యాయి. ప్రజలు ఆదరించిన జంట రేలంగి -గిరిజ. వారిద్దరి మీద చిత్రించబడిన గీతం ఇది.

ఈ పాట చిత్రీకరణ ఆరోజుల్లో ఎప్పుడూ ఉండేలా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టో, పార్కుల్లో డాన్సు చేస్తున్నట్టో కాకుండా ఒక జూపార్క్ లో చిత్రించబడడం విశేషం.

అమ్మాయి పల్లెటూరు అమ్మాయి. మంచి కట్టుబాట్ల మధ్య పెరిగింది. కొద్దిగా మోటుతనం, అమాయకత్వం నిండిన పడుచు. తండ్రి పల్లెటూరువాడైనా డబ్బు బాగా ఉంది కనుక కూతురుకి కొంచెం నాగీరకం నేర్పించి నాజూగ్గా కనిపించేలా  చెయ్యాలని, విదేశాలలో ఉండే డాక్టరుకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని కోరిక. అలాంటి అమ్మాయి పట్నవాసంలో పరిచయమయ్యాడు ఈ కుర్రవాడు. పట్నం చూపిస్తానంటూ ఇంటినుంచి బయటకి తీసుకువచ్చాడు. అదీ పాటకి సందర్భం.

 అబ్బాయి ఆ అమ్మాయికి వరసకి మామయ్య కాబట్టి -
 "ఓహోహో మామయ్యా ఇదేమయ్యా బలె బలెబాగా ఉందయ్యా.
ఇంటిని విడిచి షికారు కొస్తే ఎంతో హాయి కలదయ్యా...."
అంటూ తనకి  తండ్రి కట్టుబాట్ల మధ్యనుంచి దొరికిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఇంటిని విడిచి వచ్చి షికార్లు కొడుతున్నందుకు సంతోషం ప్రకటిస్తుంది.
అమ్మాయిని సంబోధిస్తూ ఆ మామయ్య తాము వచ్చిన చోటు గురించి చెప్తాడు.

"ఓహొహో అమ్మాయి ఇది కాలేజీ బలె బలె బతికిన కాలేజీ
మాటలురాని మృగాలు కొన్ని మనిషికి పాఠ చెబుతాయి"
అంటూ తాము జూ పార్క్ అని పిలవబడే జంతు ప్రదర్శనశాలకి వచ్చామని చెప్తాడు. జూలో బంధించబడిన జంతువులనుంచి మనం తెలుసుకోదగిన విషయాలెన్నో ఉన్నాయంటూ, "మాటలు రాని మృగాలు సైతం మనిషికి పాఠం చెబుతాయి "అంటాడు.

ఇక్కడ జూ పార్కుని బతికిన కాలేజీ అనే పదంతో ప్రయోగించడమే సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. చాలా ఏళ్ళపాటు ఆంధ్ర ప్రాంతాలలో  చాలామంది మద్రాసులోని జూని బతికిన కాలేజీ అని, మ్యూజియం ని చచ్చిన కాలేజీ అని పిలిచేవారు

పాలగుమ్మి పద్మరాజుగారు మొదటిగా  తన రచనలలో  మద్రాసు జూపార్కు గురించి రాస్తూ బతికిన కాలేజీ అనే పద ప్రయోగం చేసారని తెలిసింది. ఆ ప్రభావంతోనేమో ఆరుద్రగారు కూడా ఈ పాటలో జూపార్క్ ని బతికిన కాలేజీ అని సంబోధించారు. ఇది చాలా పాపులర్ అయింది కూడా. మద్రాసులో చూడదగిన స్థలాల జాబితాలో  బతికిన కాలేజీ, చచ్చినకాలేజీ అని చెప్పుకోవడం చాలామందికి తెలుసు.

పులి, సింహం వంటివి క్రూర జంతువులు. సాధుజంతువులను, మనుషులను వేటాడి భుజించే స్వభావం కలిగినవి. అవి అడవిలో నివసిస్తాయి. కానీ మనుషులు ఈవిధంగా వాటిని బోనుల్లో బంధించి ఉంచడం ఆ అమ్మాయికి ఆశ్చర్యం కలిగించింది. అందుకే-
"పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగితే ప్రమాదమే"
 అంటూ అందుకే వాటిని ఇలా జూలో బంధించారా? అని అడుగుతుంది. అందుకు ఆ మామయ్య ఇలా అంటాడు.

"కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు"
 అంటూ మనుషుల్లో ఉండే క్రూర స్వబావం జంతువుల క్రౌర్యాన్ని మించిపోయిందని చెప్తాడు.  అంతే కాక క్రౌర్యం పెరిగిన మనిషిని, మృగాన్ని కటకటాలలో పెడతారు అంటూ మనుషులలో క్రూర స్వభావం ఉన్నవారు చివరకు జైలు శిక్ష అనుభవిస్తారని ఓ మంచి నీతి పాఠం చెప్తాడు. జూలో జంతువులయినా, మనుషులలో నేరస్వభావం ప్రదర్శించిన వారైనా వారి నివాసం కటకటాల గదుల్లోనే అనే విషయాన్ని ఆరుద్ర ఎంతో చక్కగా చెప్పారు.

"గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రాది"
 అంటూ జూపార్క్ లోని జీబ్రా  అనే జంతువును చూపించి దాని లక్షణాన్ని ఆమెకి వివరిస్తాడు మామయ్య.  జీబ్రా చూడడానికి గాడిదలాగా ఉంటుంది. ఒళ్ళంతా నలుపురంగు నిలువు చారలుంటాయి. ఈ జీబ్రాపేరు లాటిన్ లో అడవిగుర్రం అనే అర్థంతో ఉండే పదం. అందుకే ఆరుద్రగారు జీబ్రాని అమ్మాయికి పరిచయం చేస్తూ గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రా అంటూ ఆమె ఎప్పుడూ చూడని జీబ్రాని చూపించాడు.
జిరాఫీ ని చూపిస్తూ

"చుక్కల జిరాఫీ ఒంటెకు బంధువు" అని చెప్పాడు. ఒంటె చాలా ఎత్తుగా బాగా సాగిన మెడతో ఉంటుంది. అందుకే చూడడానికి ఒంటెలా ఉండే ఆఫ్రికన్ జంతువు జిరాఫీ లేత పసుపురంగులో చుక్కలు నిండిన చర్మంతో బాగా ఎత్తుగా, పెద్ద తల మెడతో ఉంటుంది అందుకని దాన్ని ఒంటె కి బంధువు అంటూ వివరించాడు.
ఆ పక్కనే కోతి జాతికి చెందిన చింపాంజీలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ జిరాఫీ ఒంటెకి బంధువయితే "మనిషికి బంధువు  ఈ చింపాంజీ" అని పరిచయం చేసాడు. మనిషి  ఈ రూపంలోకి రావడానికి ముందు కోతి ఆకారంలో ఉండే జంతువునుంచి పరిణమించాడని డార్విన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతం. అందుకే ఎంతో కాలంనుంచి  మనమంతా "కోతి నుంచి పుట్టాడు మానవుడు" అంటూ నమ్ముతున్నాం.

ఆరుద్రగారు కూడా దీన్నే దృష్టిలో పెట్టుకుని మనిషికి బంధువు చింపంజీ అంటూ ఆ అమ్మాయికి చూపించారు. కోతులను దగ్గరగా గమనిస్తే అవి మనుషులను ఎంత చక్కగా అనుకరించగలవో చూడగలం. అందుకే
"మనుషుల చేష్టలు కోతులవైతే - కోతి చేష్టలు కొందరివి"
 అంటూ కోతులు జంతువులు కనుక  జంతు స్వభావంతో మనుషులను అనుకరించడం లాంటివి చేస్తాయి. కానీ మనుషులు కోతి కన్నా అభివృద్ధి చెందిన జీవులు. మెదడు పెరిగింది. అయినా కొందరు తను మనిషిని అన్నమాట మరిచిపోయి కోతుల్లా ప్రవర్తించడం గురించి ఇలా అన్నారు ఆరుద్ర. కోతి వేషాలు అంటూ ఆకతాయిగా ఉండే మనుషులగురించి మనం అనుకుంటూ ఉంటాం. దానిగురించే  ఆరుద్ర ఇక్కడ చక్కగా విడమర్చి చెప్పి చీవాట్లు పెట్టారు.
"తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది"
 అంటూ అమ్మాయి మామయ్యని ఓ జంతువును చూపించి అడిగింది.

"ఏనుగు వంటిది నీటిగుర్రము దానికి తమ్ముడు ఖడ్గమృగం " అని చెప్పాడు మామయ్య. ఏనుగు లాగా పెద్ద శరీరంతో నోరు ను బాగా తెరుస్తూ ఉన్న ఆ జంతువు ఏనుగులాగా పెద్దగా ఉన్నా దాని పేరు నీటిగుర్రము అని చెప్పాడు మామయ్య. అంతే కాక ఆ పక్కనే ఉన్న మరో జంతువు ఉంది. అది కూడా ఏనుగు లాగే భారీ శరీరంతో తిరుగుతోంది. దాన్ని చూపిస్తూ నీటిగుర్రంలాగే అది కూడా పెద్ద శరీరంతో ఉందని దాని పేరు ఖడ్గ మృగం అని చెప్పాడు.

ఇక్కడ మనుషుల స్వభావం మీద మరో చురకవేసారు ఆరుద్ర.
"అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకూ అలమే తింటాయి" అంటూ.
నీటిగుర్రం, ఖడ్గమృగం రెండూ ఏనుగు లాగా అతి భారీ శరీరాలున్న జంతువులే కానీ అవి కేవలం ఆకూ అలములు తిని బతికే శాకాహార జంతువులు. మనుషుల్లో అధికులు అంటే సంపన్నులు పేదవారిని దోచుకుని తింటూ వారి రక్తమాంసాలను కష్టం రూపంలో దోచుకుని తమ సంపదను పెంచుకుంటారు. నీటిగుర్రం, ఖడ్గమృగం ఆకారంలో అధికమే అయినా అవి సాత్వికమైనవే అని చెప్తూ మనిషిలోని దుర్గుణాన్ని ఎత్తిచూపించారు.

జూ పార్క్ లో సందర్శకులు ఏనుగుపైన ఎక్కి ఒకసారి విహరించడానికి అవకాశం కల్పిస్తారు జూ వారు. ఆ మామయ్య, అమ్మాయి అలా ఆ జూలో ఏనుగును ఎక్కారు. ఏనుగుఅంబారీ ఎక్కడం అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదు కదా. పాతకాలంలో రాజులు, చాలా గొప్పవారు మాత్రమే ఏనుగును ఎక్కగలిగేవారు. అందుకే అమ్మాయికి పట్టలేని సంతోషం కలిగింది.కానీ " రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా" అంటూ రాజులు ఎక్కే అంబారీపైన సామాన్యులమైన తమలాంటి వారు ఎక్కి తిరగడం తప్పేమో అనే అమాయకపు ఆలోచనతో మామయ్యని అడిగింది.


మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఒకప్పుడు మాహారాజులు పరిపాలించిన ప్రాంతాలన్నిటా రాజరికం పోయి  ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులతో నడిచే ప్రభుత్వాలు వచ్చాయి. అదే ప్రజా స్వామ్యం.  అందుకే ఆరుద్ర  ఇక్కడ-
" రాజులు పోయి రోజులు మారి ప్రజలే ప్రభువులు ఈనాడు "
అంటూ భారతదేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాన్ని  మామయ్యతో చెప్పించి అమ్మాయికి పరిచయం చేసారు.
ఒహొహో మామయ్యా ఇదేమయ్యా అంటూ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు, ఒహొహో అమ్మాయి అంటూ ప్రతి సంబోధనతో మామయ్యతో జవాబులు చెప్పించిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ సరదా పాటల్లో మేటిగా నిలిచింది.

పాట రచన   ఆరుద్ర(భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)
చిత్రం          ఆరాధన
గానం         ఘంటసాల , పి. సుశీల
అభినయం   గిరిజ, రేలంగి


19, అక్టోబర్ 2013, శనివారం

భలే ఛాన్స్...లలలాం లలలాం లకీ ఛాన్స్!!

భలే ఛాన్సులే......లలలాం లలలాం లక్కీఛాన్సులే!!

ఇల్లరికం సినిమాలోని సరదా పాట - భలే ఛాన్సులే.
కొసరాజుగారు సినిమాకి పాటలు రాసారూ అంటే నిర్మాతలు  ఖచ్చితంగా ఓమంచి హాస్యగీతం రాయించుకోవడం ఎంత రివాజో ఆ గీతాలు ప్రజల నాలుకలపై తరాలపాటు చిందులువేయడం కూడా అంతే రివాజు. ఆ కోవకు చెందినదే ఈ పాట.

ఇల్లరికం సినిమాలో కథ ప్రకారం హీరో ఇల్లరికం ఉండవలసి వస్తుంది. కానీ  అతను  తన వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి పరీక్షగా మారిన  అ అత్తవారి ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు.అయితే కమేడియన్ పాత్రకు పాటరాసేటప్పుడు ఆ పాత్రద్వారా ఈ ఇల్లరికాన్ని అనుభవించడంలో కలిగే బాధలను, అవమానాలను వివరించడానికి హీరోపాత్రను సమర్థించడానికి ఓ మంచి సందర్భంగా  దీన్ని ఉపయోగించుకున్నారు కొసరాజు. ఈ  విషయాన్ని సూటిగా చెప్పకుండా వ్యంగ్యంతో హాస్యంతో తీపికోటింగ్ అద్ది చక్కని హాస్యగుళికగా ఈ పాటను తయారుచేసారు.కొసరాజు రాఘవయ్యగారి మార్కు పాట ఇది.  పాటలో  సున్నితమైన  హాస్యం, మంచి వ్యావహారికమైన తెలుగు ఇంగ్లీషు కలిసిన పాత్రోచితమైన భాష, చెప్పదలచుకున్న విషయాన్ని చక్కని వ్యంగ్యంతో సరదాగా సాగే  వాక్యవిన్యాసంతో చెప్పడం -  అదీ కొసరాజు గారి శైలి.

 ఈ పాట ఎత్తుగడ భలే ఛాన్సులే....అని ప్రారంభం అవుతుంది. భలే ఛాన్స్ అన్న పదబంధాన్ని  విస్తృతంగా ప్రచారం లోకి తెచ్చిందీ పాట. తెలుగు భాషలో  మంచి అవకాశం అనే అర్థంలో  మంచి నుడికారంగా మారిపోయింది ఈ పదం.

తల్లితండ్రులు ఆడపిల్లని ఇంటికి మహాలక్ష్మిగా భావిస్తారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. ఎంత మురిపంగా పెంచుకున్నా ఆ ఆడపిల్ల ఆడపిల్లే కదా...ఓ అయ్యచేతిలో పెట్టాలి అనుకుంటూ ఎంతో సంతోషంగా, మరింత బాధగానూ అమ్మాయిని పెళ్ళిచేసి అత్తారింటికి పంపుతారు. అలా అమ్మాయి అత్తారింటికి కోడండ్రికం వెళ్తుంది.
అయితే కొన్ని రివర్స్ కేసులూ ఉంటాయి. ఒక్కతే కూతురు అమిత గారాబంగా పెంచుకున్నదీ అయితే ఆ అమ్మాయిని అత్తగారింటికి కాపురం పంపడం ఇష్టం లేని తల్లిదండ్రులు అల్లుడిని తమ ఇంట్లోనే అట్టే పెట్టుకునేవారు. పెళ్ళికి ముందే ఈ ఒప్పందానికి సిద్ధపడి తన తల్లిదండ్రులను వదిలి  మామగారింట శాశ్వతంగా ఉండడానికి సిద్ధపడివచ్చినవాడే ఇల్లరికం అల్లుడు. అలా వచ్చిన అల్లుడిమీద లోకానికి ఓ చులకన భావం ఉంటుంది.
అత్తమామల తదనంతరం తన భార్యకు చెందబోయే ఆస్తిమీద ఆశతోనే ఈ ఒప్పందానికి సిద్ధపడ్డాడనే భావమే దానికి కారణం.

లోకంలో ఇల్లరికం  వచ్చిన అల్లుళ్ళకి ఎన్ని రకాల అవమానాలు జరగవచ్చునో సూచిస్తూనే, వాటన్నిటినీ పట్టించుకోకుండా, దులపేసుకుని పోతే వచ్చే లాభాలను వివరిస్తూ సాగుతుంది ఈ పాట. మానం మర్యాద, సిగ్గు బిడియం అనే భావాలు వదిలేస్తే మనిషికి ఎంతో సుఖం అంటూ వ్యంగ్యంగా చెప్తూ అటువంటి జీవితంలోని దైన్యాన్ని, హైన్యాన్ని ఎత్తి చూపుతారు.

ఇల్లరికంలో ఎంతో సుఖం ఉందని చెప్తూ, ఆ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని జతగాడికి ఉపదేశం చేస్తుంటాడు ఓ ఇల్లరికం అల్లుడు. ఇల్లరికానికి ఒప్పుకుంటే ఆ ఇంట్లో అత్తమామలకు  ఒక్క కూతురే ఉండాలి. అదీ అదృష్ణయోగం అంటే. ఇక ఆ ఇంట్లో ఆ ఆడపిల్లకి తోడపుట్టిన మగపిల్లలెవరూ లేకుండా ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో పెత్తనం అంతా ఆ అల్లుడిగారిదే అవుతుంది. అలాంటి ఇల్లరికం అయితే భలే ఛాన్సు దొరికినట్టే జీవితానికి.
ఇక అలా ఒక్కకూతురే కదా, పెత్తనం చేయడానికి బావమరుదులు లేరు కనుక  ఇంటల్లుడిదే కదా అధికారం అని  ఆనందంగా  ఇల్లరికం సంబంధం ఒప్పుకున్నాక ఏం జరుగుతుందో చెప్తారు కవి. మన ఆంధ్ర దేశంలో అల్లుళ్ళంటే చాలా గౌరవం. అల్లుడు అప్పుడప్పుడే కనిపిస్తాడు.  ఏ పండక్కో  పబ్బానికో వచ్చి వెళ్తాడు. అందుకని అలా అల్లుడు వచ్చిన రెండుమూడ్రోజులు అత్తమామలు ఇంటిల్లిపాదీ తెగ మర్యాదలు చేస్తారు  ఎన్నో పిండివంటలు వండి, వడ్డించి దగ్గరుండి తినిపిస్తారు. తమ ఇంటి వాతావరణాన్ని అల్లుడు మెచ్చుకోవాలని చూస్తారు. అల్లుడి కనుసన్నల్లో ఇంటిల్లిపాదీ మెలగుతారు.

 కానీ ఇల్లరికం అల్లుడి రూటే వేరు. ఇల్లరికం అల్లుడు అంటే అత్తారింట్లో రోజూ అక్కడే ఉండే అల్లుడు. అత్తమామల కనుసన్నల్లో బ్రతికే జీవి ఇల్లరికం అల్లుడు. అతిపరిచయముచేత అనాదరణ కలుగు అంటారు భర్తృహరి సుభాషితాలలో.  బాగా చందనవృక్షాలతో నిండిఉండే మలయపర్వతం మీద నివసించే భిల్లసతి ఆ చందనపు చెక్కపుల్లలనే వంటకి వాడుతుందిట. అలా రోజూ కనిపించే, ఇంట్లోనే తిరిగే ఈ అల్లుడికి ఏ ప్రత్యేకమర్యాదలు ఉండవు. అలా ఏ మర్యాదలు లేకపోయినా, కేవలం గంజి మాత్రమే పోసినా అల్లుడు తమ అత్తగారింట్లో దాన్ని అమృతంగా భావించాలిట. రోజూ కనిపించే అల్లుడికి షడ్రసోపేతమయిన విందులు ఎవరు చేస్తారు?!  అంతేకాక  ఒకే చూరు కింద కలిసి బతికే మనుషుల  మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. మాటల మధ్యలో అల్లుడి మాటలు నచ్చకపోతే అతనిమీద చులకన భావంతో  ఛీ అనో ఛా అనో చికాకు పడితే  పడవచ్చు-మామగారో అత్తగారో. ఇవన్నీ భరించి, కనీసం భరిస్తున్నామనే విషయం మర్చిపోయి ఆనందంగా ఉండగలిగే వాడికి ఆ ఇల్లరికం -  భలే ఛాన్సే

ఇక అల్లుడి పొడ గిట్టని అత్తగార్లు, మామగార్లు ఉంటారు. అల్లుడు ఏం చేసినా నచ్చదు. తమ ఇంట్లో పొద్దస్తమానం పనీ పాటు లేకుండా ఎదురుగా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి చులకన కూడాను. ఏ చిన్న విషయమో చిలికి చిలికి గాలివానగా మారవచ్చు. అలాంటి సమయంలో ఆ అల్లుడి మొహం చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడక చిరాకు పడి ఇంట్లోంచి పొమ్మనే పరిస్థితి కూడా రావచ్చు.  ఇక ఆ గొడవ ముదిరి పాకానపడితే అల్లుడిని ఇంట్లోంచి బయటకి ఈడ్చి పడేసేంత కోపమూ రావచ్చు. కానీ ఇల్లరికం అల్లుడికి ఈ కోపతాపాలను ఖండించే హక్కు లేదు. ఆ ఇంట్లో వారెవరయినా ఏమన్నా అతను పడి ఉండవలసినదే. జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చే పరిస్థితి వస్తే ఎలాగో ఓలాగ ఇంటి చూరు పట్టుకుని వేలాడాలి కానీ వెళ్ళపోవడానికి వీలవదు.  ఇక  తనకు జరిగే అవమానాలు ఎన్నిరకాలుగానో ఉండొచ్చు. దూషణం అంటే తిట్టడం, భూషణం అంటే గౌరవించడం, తిరస్కారము అంటే అవమానం ఇలా అల్లుడికి ఎన్నిరకాలయిన అనుభవాలో కలగవచ్చు. అలాంటివన్నీ  పెద్దలు తనకిచ్చే ఆశీస్సులుగా భావించాలి..ఇల్లరికం అల్లుడు. అలాతామరాకు మీద నీటిబొట్టులా ఓ యోగిలా ఉండగలిగితే, ఉంటే అలాంటి వారికి ఇల్లరికం జీవితం భలే ఛాన్సు అన్నమాట.

ఇక ఇల్లరికం జీవితంలో ఇంత అవమానాలను, హేళనను, తిరస్కారాన్ని పొందుతున్నా ఆ జీవితాన్ని ఎందుకు భరించాలో  సూటిగా చెప్తారు ఇక్కడ కవి.  అత్తగారింట్లో ఈ విధంగా అణిగి మణిగి ఉంటే ఆ అత్తమామల ఒక్కగానొక్క కూతురు కనుక వారి ఆస్తిపాస్తులన్నీ ఆమెకే అంటే తన భార్యకే కదా దక్కుతాయి. అందువల్ల వారు ఏమన్నా మాట్లాడకుండా పడి ఉండాలిట. పండుగలొస్తే అల్లుళ్ళకి బోల్డు కానుకలిస్తారు మామగారు. ఒకవేళ మామగారు బహు లోభి అయి  ఖర్చులు తగ్గించుకుని ఆదా చేసే వాడయిఉంటే, అల్లుడిగా తనకి ఏమాత్రం కానుకలు ఇవ్వకుండా పిసినారిగా ఉన్నా దానికి  కూడా సంతోషించాలంటారు. అలా దాచిన ముల్లె యావత్తూ ఆ కూతురుకే, ఆమె భర్తకే అంటే తనకే దక్కుతుంది.కాబట్టే ఏ అవమానాలు ఎదురైనా ఇల్లరికం అల్లుడు వాటిని భరించాలి......

ఈ పాట ఎంతో సరదాగాసాగుతుంది.తల్లిదండ్రులను చూసుకోవలసిన కొడుకుగా తన కర్తవ్యాన్ని పక్కన పెట్టి తన ఆత్మగౌరవాన్ని అత్తారింట్లో తాకట్టు పెట్టి  మామగారి స్వార్జితమైన ఆస్తికోసం,  దురాశతో జీవించే ఇల్లరికం అల్లుళ్ళకి చురుక్కుమనేలా వ్యంగ్యంతోను.  ఆ రకం జీవితంలోని హైన్యాన్ని వివరించి ఆ జీవితాన్ని ఆనందించేవారికి వాతలు పెడతారు  కొసరాజుగారు.
 మామగారికి బాగా ఆస్తి ఉంది కదా అని, ఏ ఉద్యోగం పనిపాటు చేయనవసరంలేకుండా హాయిగా తిని కూర్చుని
మామగారి ఆస్తికి తేరగా హక్కుదారులు అవుదామనుకునే బద్ధకస్తులయిన అల్లుళ్ళ మెదడుగదుల్లో  బూజును దులిపి,  పరిణామాలను హెచ్చరికగా   చూపిస్తూ ఆలోచింపజేస్తుంది ఈ సరదా పాట. గీతం               కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం             మాధవపెద్ది  సత్యం
స్వరరచన        టి.చలపతి రావు
పాట సాహిత్యం
లేచాన్సులే భలేచాన్సులే
లలలాం లలలాం లక్కీచాన్సులే
భలేచాన్సులే
ఇల్లరికంలో వున్నా మజా...
ఇల్లరికంలో వున్నా మజా..
అది అనుభవించితే తెలియునులే
భలేచాన్సులే...

అత్తమామలకు ఒక్క కూతురౌ
అదృష్ట యోగం పడితే(2)
బావమరుదులే లేకుంటే
ఇంటల్లుడిదేలే అధికారం
భలేచాన్సులే...

గంజిపోసినా అమృతంలాగా
కమ్మగా ఉందనుకుంటే
బహుకమ్మగా ఉందనుకుంటే
ఛీ, ఛా అన్నా చిరాకు పడక 
దులపరించుకు పోయేవాడికి
భలేచాన్సులే (ఇల్లరికం)

జుట్టు పట్టుకుని బయటికీడ్చినా
చూరు పట్టుకొని వేలాడీ(2)
దూషణ భూషణ తిరస్కారములు
ఆశిస్సులుగా తలచేవాడికి(భలేచాన్సులే)

అణిగీ మణిగీ ఉన్నామంటే
అంతా మనకే చిక్కేది (2)
మామలోభియై కూడబెట్టితే
మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే
అది మనకే మనకే మనకే
మనకే మా మా మా మనకే